యాదాద్రి, వెలుగు : మళ్లీ అధికారంలోకి రాగానే దళితబంధు స్కీమ్ ఎస్సీలందరికీ వర్తింపజేస్తామని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హామీ ఇచ్చారు. శనివారం ఆలేరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళితబంధుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవద్దని కోరారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కుల వృత్తుల పరిరక్షణ కోసం రూ. లక్ష చొప్పున ఇచ్చామన్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న మహిళకు సౌభాగ్యలక్ష్మి స్కీమ్ కింద ప్రతి నెల రూ. 3 వేలు, రూ. 400కే గ్యాస్ సిలిండర్ను ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతామని, ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలని సూచించారు. అలాగే యాదగిరిగుట్టలో 200 మంది ఆటో డ్రైవర్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, నేతలు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్, తాళ్లపల్లి నాగరాజు, దండెబోయిన అనిల్, ఆరె యాదగిరి గౌడ్, కోల వెంకటేశ్ గౌడ్, పాండవుల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.