మళ్లీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌దే అధికారం : గొంగిడి సునీత

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్  అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత ధీమా వ్యక్తం చేశారు.  యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం సికిందర్ నగర్, కాటేపల్లి, ముత్తిరెడ్డిగూడెం, నాంచారిపేట, కదిరేనిగూడెం, కొండాపూర్, పిట్టలగూడెం, గడ్డగొల్లబావి, చాడలో ఆదివారం.. బొమ్మలరామారం మండలం కేకే తండా, చాపర్ చెట్టు తండా, పండుతండా, లక్కతండా, దేవునితండా, భూక్యాతండా, కోమటికుంట తండా, రామస్వామి తండాలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే విపక్షాలు ఓరుస్తలేవని అసహనం వ్యక్తం చేశారు.  ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో ప్రత్యక్షంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. 

కొందరు నేతలు తమ రాజకీయ మనుగడ కోసం పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు సహా రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also read:-ఆరు గ్యారంటీలతో మోసం చేసే కుట్ర