యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్యను గెలిపిస్తే ఆలేరు నియోజకవర్గాన్ని అడ్డికిపావుశేరు లెక్క అమ్మేస్తాడని బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీర్ల అయిలయ్య తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నాడని మండిపడ్డారు.
తాను ఎమ్మెల్యే కాకముందే యాదగిరిగుట్టలో ఇల్లు కొన్నానని, ప్రభుత్వ భూముల సర్వే నంబర్లను మార్చి అక్రమదారిలో సంపాదించలేదని విమర్శించారు. గుట్టలు, పుట్టలను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తిన చరిత్ర కాంగ్రెస్ అభ్యర్థిదైతే.. పదేళ్లుగా తాను నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే కాకముందే గట్టలు మాయం చేస్తే.. గెలిస్తే ఏం చేస్తాడో ఆలోచన చేయాలని కోరారు. అలాగే యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు, గుండాల మండలం అనంతారం గ్రామాలకు చెందిన 200 మంది కాంగ్రెస్ నాయకులు మంగళవారం డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.