బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల్లో వణుకు: గొంగిడి సునీత 

యాదగిరిగుట్ట, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించిన మేనిఫెస్టోతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం గుండ్లపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆరె యాదగిరి గౌడ్ , మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్యతో పాటు గుండాల మండలం పాచిల్ల, వెల్మజాల, రాజాపేట మండలం జాలా, తుర్కపల్లి మండలం మాదాపూర్ కు చెందిన 600లకు పైగా నేతలు మంగళవారం బీఆర్‌‌‌‌ఎస్‌‌లో చేరారు.  

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌‌లు స్కాములకు గ్యారంటీలని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. అమలుకు సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో రూపొందించారన్నారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా అమలు చేశారని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గడ్డమీది రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.