
అందమైన అడవి.. కళ్లను కట్టిపడేసే సుందర దృశ్యాలు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. పురాణాలు, చరిత్రకు ఆనవాళ్లుగా చెప్పుకునే పర్యాటకుల మనసును ఆకట్టుకునే కట్టడాలు. నేటికీ నిలిచి ఇది తెలంగాణ చరిత్ర అని గర్వంగా చెప్పే గుర్తులు.. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి. జిల్లాలోనివే.. ఇప్పుడు ఈ ప్రాంత విశేషాలను చూద్దాం. . .
గుట్టపై నుంచి జాలువారే జలపాతాల హోరు.. కాకతీయుల కాలం నాటి రాతి కట్టడాలు.... ఏడాది పొడుగునా ఎండిపోని చిన్నకొలను.. ప్రజల నమ్మకాలతో ముడిపడిన స్థానిక చరిత్ర... వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే సమ్మర్ హాలిడేస్ ట్రిప్ కు గొంతెమ్మగుట్టకు వెళ్లాల్సిందే.
పురాణ కథ
గొంతెమ్మగుట్టకు ద్వాపరయుగానికి సంబంధం ఉందని స్థలపురాణం దెబుతోంది. కృష్ణుడు... కుంతీదేవి ... సుభద్ర కొంతకాలం ఈ ప్రాంతంలో ఉన్నారని... ఆ సమయంలోనే కుంతీదేవి ఇక్కడ తపస్సు చేసిందని స్థానికులు చెప్తారు. అందుకు గుర్తుగా ఈ గుట్టపై ఒక గుహ ఉంది. ఆ గుహలో శివలింగం కూడా ఉంది. ఆశివలింగాన్నే కుంతీదేవి పూజించి, వరాలు పొందిందని చెప్పారు అక్కడి వాళ్లు . ఈ శివలింగానికి దగ్గర్లోనే పాద ముద్రల గుర్తులు ఉన్నాయి. వీటిని శ్రీకృష్ణుడి పాద ముద్రలుగా భావించి స్థానికులు పూజిస్తున్నారు.
ప్రతాపరుద్రుడి సైనిక స్థావరం
ఈ గుట్టపై ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మూడు అంచెలుగా కట్టిన గోడ ఉంది. ఈ గోడ కాకతీయుల ప్రభువైన ప్రతాపరుద్రుడి కాలం నాటిది .. అంటే 14వ శతాబ్దం నాటిదన్నమాట. మొఘల్ సైన్యం నుంచి ప్రతారుడ్రుడు తనను, తన సైన్యాన్ని కాపాడుకోవడానికి ఈ గుట్టపై కొంతకాలం ఉన్నాడని చరిత్ర చెబుతోంది. శత్రువులు ప్రవేశించడానికి అనుకూలంగా లేనివిధంగా దీనిని నిర్మించినట్లు అర్థమవుతుంది. ఈ గోడకు బురుజులు కూడా ఉన్నాయి. ఈ బురుజుల్లో సైనికులు ఉండి దూరం నుంచి వచ్చే శత్రువులను గమనించేవాళ్లని వీటి నిర్మాణాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే, సైనికుల నీటి అవసరాలకోసం ఒకటని కోటకు, రెండో కోటకు మధ్య నీటిని నిల్వచేసుకునే ఒక డ్యామ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. కొండల మీద నుంచి ప్రవహించే నీళ్లు ఇక్కడ నిల్వ ఉంటాయి. వాటిని తమ అవసరాలకోసం వాడుకునేవాళ్లని భావించవచ్చు.
దిగుబడి పెంచే కొలను నీళ్లు
గుట్టపై నుంచి కోటలోకి వెళ్తుంటే కుడివైపు ఒక గుంట కనిపిస్తుంది. దీనిలో అన్ని కాలాల్లో నీళ్లు ఉంటాయని స్థానికులు చెప్తారు. ఈ కొలనును కుంతీదేవి కొలను అని పిలుస్తారు. ఈ కొలనులో నీళ్లు తీసుకెళ్లి పంటలకు చల్లితే తెగుళ్లు సోకకుండా మంచి దిగుబడి వస్తుందని ఇక్కడి వాళ్ల నమ్మకం. అందుకే ఇప్పటికీ ఈ నీటిని తీసుకెళ్లి పంటలకు చల్లుతుంటారు. ఇదో ఆచారంగా కొనసాగుతోంది.
పచ్చని ప్రకృతి
గొంతెమ్మ గుట్టను చూడడం అంటే అందమైన అడవిని కళ్లారా చూడడమే. పరవశించే ప్రకృతిలో సేద తీరడమే. ఈ గుట్ట ఎత్తు 250 మీటర్లు గుట్ట మీద నుంచి కిందకు ప్రవహించే జలపాతాలు, పర్యాటకుల చెవులకు వాటి హోరు ఇంపుగా తాకుతుంది. తెల్లటి నురగలతో అది మళ్లీ మళ్లీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ గుట్టపై నుంచి చూస్తే దూరంగా గోదావరి మరింత అందంగా కనిపిస్తుంది. గుట్టపై కోటలు, అపురూపమైన రాతి కట్టడాలు.. పర్యాటకుల మనసునుఆకట్టుకుంటాయి.
వర్షాలు కురుస్థాయి
ఒకప్పుడు ఇక్కడ నివసించే ప్రజలు వర్షాలు కురవక కరువు బారిన పడ్డాడు. ఆ పరిస్థితులను తట్టుకోలేక ఈ గుట్టకు దగ్గర్లో ఉన్న ప్రతాపగిరి ప్రజలు గొంతెమ్మ గుట్టకు వచ్చి వర్షాలు కురిపించమని మొక్కుకున్నారట ఆ తర్వాత వానలు పడడంతో ప్రజలు సంతోషించి జాతర చేశారు. ఇప్పటికీ ఇది ఆచారంగా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాదీ లక్ష్మీదేవర పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటూ శివస్తుతులు చదువుతూ, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి భూపాలపల్లి బస్సులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి 25 కి.మీ. ప్రయాణిస్తే కాటారం వస్తుంది. ఆ తర్వాత ప్రతాపగిరి గ్రామానికి వెళ్లాలి. ప్రతాపగిరి నుంచి నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే గొంతెమ్మ గుట్టకు చేరుకోవచ్చు. ఆటోలు ఈ మార్గంలో ఎప్పుడూ ఉంటాయి.
-–వెలుగు, లైఫ్–