Good Food:  సేమియాతో ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​

Good Food:  సేమియాతో ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​

సేమియా అంటే అందరికీ - మొదటగా గుర్తొచ్చేది...పాయసం, ఆ తర్వాత ఉప్మా. అవునా.... అయితే ఎప్పుడూ ఈ రెండు వెరైటీలే తింటే ఎలా? ఒకసారి కాకపోయినా ఇంకోసారైనా బోర్ కొడుతుంది. అందుకే ఇంట్రెస్టింగ్ , టేస్టీగా తినాలంటే ఇలాంటి వెరైటీలు ట్రై చేయాలి. అప్పుడే వంటకం నోటికీ, మనసుకీ రుచిగా ఉంటుంది. మరెందుకాలస్యం వెంటనే ట్రై చేయండి ఇలా...
సేమియా స్పెషల్స్

సేమియా దోశ తయారీకి కావలసినవి

  • సేమియా (వేగించిన) -రెండు కప్పులు 
  • ఉప్మారవ్వ - అరకప్పు
  • గోధుమపిండి- ఒకటిన్నర కప్పు
  •  పచ్చిమిర్చి తరుగు ఒకటీ స్నూన్​
  • అల్లం తరుగు - అర టీ స్పూన్ 
  • కరివేపాకు- ఒక రెమ్మ
  •  ఉప్పు - తగినంత 
  • నూనె - సరిపడా
  •  జీలకర్ర- పావు టీస్పూన్
  • ఆవాలు- పావు టీస్పూన్

తయారీ విధానం: వేగించిన సేమియాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి ఆ పొడిలో గోధుమపిండి ఉప్మారవ్వ.. ఉప్పు, కొన్ని నీళ్లు పోసి కలపాలి. తర్వాత స్టవ్​ పై పాన్​ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలను వేగించాలి. ఆ పోపును కూడా పిండిలో వేసి కలపాలి. దాంట్లోనే వచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తరుగు వేసి, పిండిని గంట సేపు నానబెట్టాలి. తర్వాత ఆ పిండితో పెనంపై దోశలు పోయాలి. వీటిని కొబ్బరి లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకోవాలి.

సేమియా పకోడీ తయారీకి కావలసినవి

  • సేమియా - ఒక కప్పు
  • శనగపిండి- ఒక కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు - పావు కప్పు 
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్ 
  • కరివేపాకు - ఒక రెమ్మ
  •  కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్
  • వంట సోడా -చిటికెడు 
  • కారం- రుచికి తగినంత 
  • ఉప్పు - తగినంత 
  • నూనె - సరిపడా

తయారీ విధానం: స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో సేమియా వేసి దోరగా వేగించాలి. ఇంకో గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి .దాంట్లో వేగించిన సేమియా వేసి మెత్తగయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి. ఆ సేమియాలో శెనగపిండి, ఉల్లిగడ్డ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తరుగు, వంట సోడా, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడీ పిండిలా కలపాలి. తర్వాత స్టవ్​పై పాన్​ పెట్టి నూనె వేడి చేయాలి. దాంట్లో పిండిని కొద్దికొద్దిగా వేసి వేగించాలి. వీటిని సాస్​ తో నంజుకుంటే కమ్మగా ఉంటాయి.

బర్డ్స్ నెస్ట్ తయారీకి కావాల్సినవి

  • సీమియా (వేగించిన) - ఒక కప్పు 
  • ఉడికించిన అలుగడ్డలు (చిదమాలి)- ఐదు 
  • పచ్చిమిర్చి తరుగు - ఒకటీ స్పూన్
  • ఉల్లిగడ్డ తరుగు - పావుకప్పు
  • ఉప్పు - తగినంత
  •  కారం- అరటీ స్పూన్
  • అల్లం పేస్ట్ - అరటీస్పూన్ 
  • జీలకర్ర పొడి - అరటీ స్పూన్
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • మొక్కజొన్న పిండి- రెండు టేబుల్ స్పూన్లు
  • మైదా పిండి - రెండు టేబుల్ స్పూను
  • నూనె - సరిపడా

తయారీ విధానం: ఒక  గిన్నెలో అలుగడ్డ మిశ్రమం. ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు.. ఉప్పు, కారం, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి,  ధనియాల పొడి వేసి కలపాలి. ఇంకో గిన్నెలో మొక్కజొన్నపిండి.. మైదా పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చిక్కగా కలపాలి. అలుగడ్డ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుని, పిట్ట గూడు ఆకారంలో వత్తాలి. వాటిని పిండిలో ముంచి, తర్వాత వేగించిన సేమియాలో దొర్లించి నూనెలో డీప్ ఫ్రై చేయాలి.

సేమియా ఇడ్లీ తయారీకి కావాల్సినవి

  • సేమియా (వేగించిన)-రెండు కప్పులు 
  • ఇడ్లీ రవ్వ- పావు కప్పు 
  • పెరుగు- ఒక కప్పు
  • కొత్తిమీర తరుగు - పావుకప్పు
  • ఆవాలు- పావు టీ స్పూన్ 
  • శనగపప్పు- ఒక టీ స్పూన్
  • మినప్పప్పు - ఒక టీ స్పూన్ 
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీస్పూన్
  • అల్లం తరుగు - పావు టీ స్పూన్
  • కరివేపాకు - ఒక రెమ్మ 
  • ఉప్పు- తగినంత
  • నూనె - సరిపడా

తయారీ విధానం: స్టవ్​ పై పాన్  పెట్టి నూనె వేడి చేయాలి. అందులో సేమియా, రవ్వను విడివిడిగా వేగించాలి. మరో పాన్ లో ఆవాలు, శెనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. అందులోనే సేమియా, ఉప్పు, కొత్తిమీర తరుగు, పెరుగు, కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. సేమియా గట్టిపడ్డాక, దాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రల్లో పెట్టాలి పది నిమిషాల పాటు వాటిని అవిరిపై ఉడికించాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడివేడి సేమియా ఇడ్లీ రెడీ.

–-వెలుగు, లైఫ్​–