కోలీవుడ్ స్టార్ అజిత్‌కు టాలీవుడ్‌లోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయన ఓ తెలుగు ప్రొడక్షన్ హౌస్‌లో నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది.
ఈ షెడ్యూల్లో అజిత్‌పై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్‌తోపాటు ఓ ఫైట్ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారు. ఈ ఎంట్రీ సాంగ్ అజిత్ ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారని, వీటిలో ఒకటి నెగెటివ్ రోల్ అని తెలుస్తోంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పొంగల్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు మాగిజ్ తిరుమేని డైరెక్షన్లో ‘విదా ముయార్చి’ చిత్రంలో అజిత్ నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.