టెన్త్ చదువుతున్న విద్యార్థులందరూ.. వచ్చే ఏడాది ఇంటర్లో చేరేందుకు దరఖాస్తు చేసుకునే టైమొచ్చింది. రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు. రిటెన్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలెక్షన్. టెన్త్ సిలబస్‌పైనే రిటెన్ టెస్టు ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లకు జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, ఎంసెట్, నీట్ వంటి నేషనల్ టెస్టులకు ఈ కాలేజీల్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సదుపాయముంది. టీచింగ్ అంతా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. రెండేళ్లపాటు హాస్టల్, ఫుడ్, స్టేషనరీ అంతా ఫ్రీ. తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పూర్తి వివరాలకు..
ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 11 సీట్లు.. ఐఐఐటీల్లో 10.. ఎన్ఐటీల్లో 41.. ఎంసెట్‌లో 77 టాప్ ర్యాంకులు.. ఎంబీబీఎస్‌లో నలుగురు.. ఎయిమ్స్‌లో ఒకరు.. ఇవన్నీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ విద్యార్థులు సాధించిన మెరిట్ సీట్లు. పేద విద్యార్థులు టాప్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో చదివేలా ప్రోత్సహించేందుకు 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు రెండు సొసైటీలు ప్రకటనలు విడుదల చేసింది.
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్), ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) నిర్వహిస్తున్న కొన్ని కాలేజీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అండ్ స్కూల్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఐఐటీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశారు. రెండు సొసైటీలు వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించి ఎంపికయిన వారికి ఫస్టియర్ ఎంపీసీ/బైపీసీలో ప్రవేశం కల్పించి జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, ఎంసెట్, నీట్, ఏఐఐఎమ్‌ఎస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అందిస్తారు. రెండు సంవత్సరాల పాటు హాస్టల్, భోజన వసతి, ఫ్రీ స్టేషనరీ, ఇతర సదుపాయాలు కల్పించి ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్స్ కు ధీటుగా బోధిస్తారు. టీచింగ్ అంతా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది.
4 వేలకు పైగా సీట్లు
ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన 18 సీవోఈ/ఎస్‌వోఈల్లో ఎంపీసీలో 735, బైపీసీలో 725 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 8 కాలేజీలు బాలికలకు ప్రత్యేకం కాగా మిగిలినవి బాలుర కాలేజీలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 28 సోషల్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎంపీసీలో 1240, బైపీసీలో 1240, ఎంఈసీలో 120, సీఈసీలో 80 సీట్లున్నాయి. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 75 శాతం సీట్లు ఎస్సీలు, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో అన్ని సీట్లు ఎస్టీలకు కేటాయించారు.
సెలెక్షన్ ప్రాసెస్
తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో రెండు దశల్లో నిర్వహించే స్ర్కీనింగ్ టెస్ట్‌లో మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. లెవెల్–1 పరీక్ష ఆబ్జెక్టివ్ కాగా లెవెల్–2లో డిస్ర్కిప్టివ్ టైప్ టెస్టు ఉంటుంది. మొదటి దశ టెస్టులో మెరిట్ సాధించిన వారిని సీట్ల సంఖ్యను బట్టి సోషల్ వెల్ఫేర్ కు 1 : 3, ట్రైబల్ వెల్ఫేర్ కు 1 : 4 నిష్పత్తిలో లెవెల్ 2 స్ర్కీనింగ్ టెస్టు (డిస్ర్కిప్టివ్) కు ఎంపిక చేస్తారు. ప్రశ్నలు 8 నుంచి పదోతరగతి స్థాయిలో అవే పాఠ్యపుస్తకాల నుంచి వస్తాయి. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లోఉంటుంది. అడ్మిషన్ టైంలో టాప్‌లో వచ్చిన వారికి ముందుగా రాజేంద్రనగర్ ఐఐటీ స్టడీ సెంటర్, వరంగల్ (బాలికలు) ఖమ్మం (బాలురు) టీటీడబ్ల్యూఆర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్/స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లో ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన వారు మెరిట్ ప్రకారం ఇతర కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు.
టెస్ట్ ప్యాటర్న్ టీఎస్‌డబ్ల్యూఆర్ఈఎస్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
మ్యాథ్స్ 30 30
ఫిజికల్ సైన్స్ 30 30
బయోసైన్స్ 30 30
సోషల్ స్టడీస్ 30 30
ఇంగ్లిష్ కాంప్రహెన్సన్ 20 20
జీకే & కరెంట్ అఫైర్స్ 20 20
మొత్తం 160 160
టీటీడబ్ల్యూఆర్ఈఎస్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ఇంగ్లిష్ 40 40
ఫిజిక్స్ 40 40
కెమిస్ట్రీ 40 40
ఎంపీసీ
మ్యాథ్స్ 40 40
బైపీసీ
బయాలజీ 40 40
మొత్తం 160 160
డిస్ర్కిప్టివ్ టెస్ట్
సోషల్ వెల్ఫేర్ ఎంట్రన్స్ టెస్టు మొదటి దశ క్వాలిఫై అయిన అన్ని గ్రూపుల విద్యార్థులకు 150 మార్కులకు డిస్ర్కిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఎంపీసీ అభ్యర్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఒక్కో సబ్జెక్టు నుంచి 45 మార్కులకు వ్యాసరూప సమాధాన ప్రశ్నలిస్తారు. సీఈసీ/ఎంఈసీ లో చేరాలనుకునేవారికి మ్యాథ్స్‌లో 45, సోషల్ స్టడీస్‌లో 55, జనరల్ నాలెడ్జ్ నుండి 15 మార్కులకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇంగ్లిష్ కాంప్రహెన్సన్ మూడు గ్రూపుల వారికి కామన్‌గా 15 మార్కులకుంటుంది. ట్రైబల్ వెల్ఫేర్ టెస్టులో ఎంపీసీ, బైపీసీ వారికి 40 మార్కులకు సెపరేట్ గా డిస్ర్కిప్టివ్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో ప్రతి సబ్జెక్టు నుండి 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు (20 మార్కులు), 5 స్వల్ప సమాధాన ప్రశ్నలు (20 మార్కులు) ఇస్తారు. – వెలుగు ఎడ్యుకేషన్‍డెస్క్
నోటిఫికేషన్
అర్హత: 2020లో ఎస్ఎస్‌సీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ బోర్డులు నిర్వహిస్తున్న టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు అర్హులు. మొదటి అటెంప్ట్‌లోనే A1 నుంచి B2 గ్రేడులు (7 పాయింట్లు) పొంది ఉండాలి.
ఆదాయం: కుటుంబ వార్షికాదాయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రెండు లక్షలకు మించకూడదు. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) కు చెందిన విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్ రాయకుండానే హయత్‌నగర్, చెంగిచెర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల్లో ప్రవేశాలు పొందొచ్చు.
వయసు: 2020 ఆగస్టు 31 నాటికి 17 సంవత్సరాలకు మించకూడదు. ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత వెబ్సైట్లో ఆన్‌లైన్ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు నింపాలి. తగిన ఫీజు చెల్లించి ఫోటో, సంతకం నిర్దేశిత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిచూసుకొని సబ్‌మిట్ చేయాలి.
పరీక్షా కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 118 సోషల్ వెల్ఫేర్, 25 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ముఖ్యతేదీలు
చివరితేది: 2019 డిసెంబర్ 20
ఎంట్రన్స్ టెస్ట్ తేది
టీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్
లెవెల్-I: 2020 జనవరి 5
లెవెల్-II: 2020 ఫిబ్రవరి 9
టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్
లెవెల్-I: 2020 జనవరి 12
లెవెల్-II: 2020 ఫిబ్రవరి 16
వెబ్‌సైట్స్: www.tswreis.in, www.tgtwgurukulam.telangana.gov.in
ఇంగ్లిష్: విద్యార్థి అవగాహన (కాంప్రహెన్సన్) ను పరీక్షించేందుకు ఇంగ్లిష్‌లో ప్రధానంగా ప్యాసేజ్ ప్రశ్నలిస్తారు. కనీసం 100 పదాలకు తగ్గకుండా ఏదైనా ఒక అంశంపై ప్యాసేజ్‍ఇచ్చి దాని ఆధారంగా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ప్యాసేజ్ థీమ్ ఏంటి? అందులో వాడిన పదాలు - వాటి అర్థాలు, రచయిత ఉద్దేశం ఏంటో తెలుసుకోగలగాలి. మిగిలిన ప్రశ్నల్లో ప్రిపొజిషన్స్, వన్‍వర్డ్ సబ్‍స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్, సిననిమ్స్, క్వశ్చన్‍ట్యాగ్స్, ప్రనౌన్స్, టెన్సెస్, స్పీచెస్, ఫిగర్‍ఆఫ్‍స్పీచెస్, ఇడియమ్స్, ప్రేజెస్, వాయిసెస్, ఆంటోనిమ్స్, బైనామినల్స్, సెంటెన్స్ కరెక్షన్, అడ్జెక్టివ్స్, కన్‍జంక్షన్స్, ఆర్టికల్స్, ఫామ్‍ఆఫ్ వర్బ్స్, జెరండ్స్, అడ్‍వర్బ్స్, మోడల్స్ వంటి దాదాపు అన్ని గ్రామర్‍టాపిక్‍ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇందుకు గాను వొకాబులరీ, టెన్సెస్ ఇతర గ్రామర్‍ను నేర్చుకోవాలి. వీలైనన్ని మోడల్స్ సాధన చేయాలి. ముఖ్యంగా పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించి సాధన చేయడం వల్ల ఇంగ్లిష్‌లో మంచి మార్కులు పొందవచ్చు.
బయాలజీ: బయాలజీలో ప్రశ్నలన్నీ విషయావగాహనను పరీక్షించే విధంగా ఉంటాయి. అంటే సబ్జెక్టును చదివితేనే రాయగలరు. ఉదాహరణకు జఠరగ్రంథులు స్రవించే రసాలు ఏవి? మానవుడిలో ఎన్ని రకాల నాడులున్నాయి? అవాయు శ్వాసక్రియలో ఏర్పడే అంత్య పదార్థం ఏది? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే చాప్టర్‍లోని విషయాన్ని చదవాల్సిందే. బయాలజీలో మానవ శరీర ధర్మశాస్ర్తం పైనే దాదాపు 50 శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పోషణ- ఆహార సరఫరా వ్యవస్థ, శ్వాసక్రియ-శక్తి ఉత్పాదక వ్యవస్థ, ప్రసరణ, విసర్జన-వ్యర్థాల తొలగింపు వ్యవస్థ, నియంత్రణ – సమన్వయ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, జీవక్రియలలో సమన్వయం, అనువంశికత, మన పర్యావరణం, సహజ వనరులు వంటి పదోతరగతి చాప్టర్లను చదువుకోవాలి.
ఫిజికల్‍సైన్స్: ఫిజికల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ర్టీ కలిసి ఉంటాయి. ఇందులో కాన్సెప్ట్‌పై ఎక్కువ ప్రశ్నలిస్తారు. గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, రసాయన సమీకరణాలు, ఆమ్లాలు,- క్షారాలు,- లవణాలు, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను-రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ – ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్‍ప్రవాహం, విద్యుదయాస్కాంతత్వం, లోహ సంగ్రహణ శాస్ర్తం, కార్బన్- దాని సమ్మేళనాలు వంటి అధ్యాయాలు ముఖ్యమైనవి. వాయువులు, రసాయన సమీకరణాలు, సూత్రాలు, విద్యుత్ వలయాలు, ఎలక్ర్టాన్ విన్యాసాలు, ఆవర్తన పట్టిక, కటకాలు, ఫార్ములాలు, బొమ్మలపై ఖచ్చితమైన ప్రశ్నలు ఉంటాయి. లెక్కలపై కనీసం 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందుకు ప్రీవియస్‍పేపర్‌లో ప్రశ్నలను గమనించడం ద్వారా సాధన చేయవచ్చు.
మ్యాథమెటిక్స్: ప్యూర్ మ్యాథ్స్‌తో పాటు అర్థమెటిక్ చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలిస్తున్నారు. వాస్తవసంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, సరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు మరియు ఛేదనరేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి, త్రికోణమితి అనువర్తనాలు, సంభావ్యత, సాంఖ్యక శాస్ర్తం వంటి చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్‌లో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఫార్ములాలు. పదోతరగతి అన్ని చాప్టర్లలోని సూత్రాలను నేర్చుకోవాలి. గత పరీక్షలో వచ్చిన ప్రశ్నలను సూత్రాల ఆధారంగా ప్రాక్టీస్‍చేస్తే పరీక్షలో మంచి మార్కులు పొందొచ్చు.
సోషల్‍స్టడీస్: ఈ సబ్జెక్టులో ప్రశ్నలన్నీ పూర్తిగా కరెంట్ ఎఫైర్స్‌తో ముడిపెట్టి అడుగుతారు. ఉదాహరణకు ఉగ్రవాద దాడుల ఉద్రిక్తతల నడుమ జమ్మూ కాశ్మీర్, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, అయోధ్య తీర్పు పూర్వాపరాలు, రాజ్యాంగ సవరణలు, వాఘా సరిహద్దు, లైన్‍ఆఫ్ కంట్రోల్, సింధూ నదీ జలాలు, అంతర్జాతీయ న్యాయస్థానం, విదేశీ పర్యటనలు, అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలనుండి అమెరికా వైదొలగడం వంటి అంశాలు ఇటీవల వార్తల్లో నిలిచాయి. రాజ్యాంగం, ఎన్నికల ప్రక్రియ, తాజా నియామకాలు, సుప్రీంకోర్టు తీర్పులపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్‌లోని చాప్టర్లను చదువుతున్నప్పుడే వాటికి సంబంధించి ఏదైనా తాజా పరిణామం చోటు చేసుకుందో లేదో గమనించి చదివితే ఎక్కువ మార్కులు పొందొచ్చు. మనదేశ శీతోష్ణస్థితి, నదులు, నీటివనరులు, జనాభా, ప్రజలు నివాస ప్రాంతాలు వలసలు, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి-ఉపాధి, ప్రపంచీకరణ, ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి – సమానత వంటి టాపిక్‍లతో పాటు హిస్టరీ, పౌరశాస్ర్తంలోని ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు, భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్ర్యం, స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం, ఎన్నికల ప్రక్రియ, రాజకీయ ధోరణుల ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.