- వర్సిటీకి అదనంగా రూ.20 కోట్లు రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్
- రూ.20 కోట్లతో బాయ్స్, గర్ల్స్ హాస్టళ్ల నిర్మాణం
మహబూబ్‌నగర్/ మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: పదేండ్ల తర్వాత పాలమూరు యూనివర్సిటీ(పీయూ)కి మంచి రోజులు వచ్చాయి. ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్(పీఎంయూఎస్హెచ్ఏ) స్కీం కింద రూ. వంద కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్సిటీ డెవలప్మెంట్కు ఇటీవల రూ.20 కోట్లు కేటాయించింది. ఈ ఫండ్స్‌తో వర్సిటీలో మౌలిక సదుపాయాలు, గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు, ఇతర భవనాల నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.120 కోట్లు
2023లో పీఎం యూఎస్‌హెచ్‌ఏ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని దేశంలోని అన్ని యూనివర్సిటీలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు పాలమూరు యూనివర్సిటీ ఆఫీసర్లు డెవలప్మెంట్ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ సిద్ధం చేసి రాష్ట్ర సర్కారుకు పంపారు. అనంతరం పీఎంయూఎస్హెచ్ఏ కోఆర్డినేటర్ సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కేంద్రానికి ప్రపోజల్స్ పంపారు. ఈ ప్రపోజల్స్‌ను పరిశీలించిన కేంద్రం.. పీయూకు ఫండ్స్ రిలీజ్ చేసింది.
దేశంలోని 26 యూనివర్సిటీలకు రూ.వంద కోట్ల ఫండ్స్ కేటాయించగా, అందులో పీయూకు చోటు కల్పించింది. ఈ ఫండ్స్ ద్వారా వర్సిటీలో కొత్తగా రూ.20 కోట్లతో గర్ల్స్, బాయ్స్ హాస్టళ్లు నిర్మించనున్నారు. ఇతర అకడమిక్ బిల్డింగులు, స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్, రీసెర్చ్ డెవలప్ మెంట్ కోసం ఫండ్స్ ఖర్చు చేయనున్నారు. కాగా, కేంద్రం నుంచి 2017లో వర్సిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ ఫండ్స్‌తో ఎగ్జామినేషన్ బ్రాంచ్, గెస్ట్ హౌస్, సోలార్ సిస్టం ఏర్పాటు, సీసీ రోడ్ల కోసం వెచ్చించారు. నిధులు పూర్తిగా సద్వినియోగం కావడంతో రెండోసారి కేంద్రం పీయూను ఈ స్కీం కింద గుర్తించి పెద్ద మొత్తంలో ఫండ్స్ మంజూరు చేసింది.
ఏడేండ్లలో రెండు సార్లే..
గత ప్రభుత్వం ఏడేండ్లలో పీయూకు బడ్జెట్లో డెవలప్మెంట్ కోసం రెండు సార్లు మాత్రమే బడ్జెట్ కేటాయించింది. 2017–18 రాష్ట్ర బడ్జెట్లో జీతాల కోసం రూ.5.7 కోట్లు కేటాయించగా, డెవలప్మెంట్ కోసం రూ.10 కోట్లను విడుదల చేసింది. 2018–19లో జీతాల కోసం రూ.6.7 కోట్లు కేటాయించింది. 2019–-20లో జీతాలకు రూ.6.63 కోట్లు ఇవ్వగా, రూ.90 లక్షలు మాత్రమే డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు డెవలప్మెంట్కు పైసా ఇవ్వలేదు. కాగా 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి పీయూను సందర్శించి రూ.16 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారు. మళ్లీ పదేండ్లకు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్‌లోకి రాగానే పీయూకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్సిటీ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 కోట్లు రిలీజ్ చేసింది.
పీయూ విశేషాలు..
2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్పాలమూరు వర్సిటీని ఏర్పాటు చేశారు. 176 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని నిర్మించారు. దీని పరిధిలో నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 90 డిగ్రీ కాలేజీలు ఉండగా, అందులో 22 గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఒక అటానమస్ కాలేజ్(ఎంవీఎస్), మూడు ట్రైబల్ వెల్ఫేర్, మూడు సోషల్ వెల్ఫేర్, మూడు మహాత్మా జ్యోతిబా ఫూలే కాలేజీలున్నాయి.
వర్సిటీలో ప్రస్తుతం 18 రకాల పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, ఇండిగ్రేటెడ్ కెమిస్ట్రీ(ఐదేండ్లు), ఎంఏ ఇంగ్లిష్, ఎకానమిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఏ తెలుగు, ఎంఈడీ, ఎం ఫార్మసీ, రెగ్యులేటరీ ఎపిమర్స్, ఫార్మకాలజి, ఎంబీఏ, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్ కోర్సులున్నాయి. పీయూ పరిధిలో 10,074 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుకుంటున్నారు.
స్టూడెంట్లకు మేలు జరుగుతుంది
గత ప్రభుత్వం పీయూను పట్టించుకోలేదు. పీయూ డెవలప్మెంట్కు రూ.వంద కోట్లు మంజూరు కావడం ఆక్సిజన్ లాంటిది. వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంజూరైన ఫండ్స్‌తో స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. రాష్ట్ర సర్కారు కూడా పీయూను డెవలప్ చేసే బాధ్యత తీసుకుంది. వర్సిటీలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీంతో వర్సిటీకి మంచి రోజులు వస్తాయి.
–యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే
రూమ్స్ లేక ఇబ్బందులు..
గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్ ఇరుకుగా ఉన్నాయి. ఫైనాన్స్ కోర్సులకు క్లాస్ రూమ్స్ లేవు. ఎన్విరాన్మెంటల్, తెలుగు, ఎంసీఏ స్టూడెంట్లకు క్లాస్ రూమ్స్ లేక ల్యాబ్‌లో కూర్చోబెడుతున్నారు. ప్రస్తుతం మంజూరైన ఫండ్స్‌తో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టించాలి. కొత్త హాస్టళ్లు నిర్మించాలి.
–బత్తిని రాము, పీయూ జేఏసీ కన్వీనర్