కేజ్రీవాల్​ ఓటమి.. కాంగ్రెస్​కు మంచి రోజులు?

కేజ్రీవాల్​ ఓటమి.. కాంగ్రెస్​కు మంచి రోజులు?

నిజంగా ఆమ్​ ఆద్మీ పార్టీ ఓటమిలో కాంగ్రెస్​ గెలుపు దాగిఉందా?  ​ ఢిల్లీలోనే  కాకుండా, పంజాబ్​లో కూడా ఆప్​ను బలహీనపర్చాలని కాంగ్రెస్​, బీజేపీలు భావిస్తున్నాయా? దేశంలో  బలమైన జాతీయ పార్టీగా  ఎదిగిన బీజేపీకి, బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ పార్టీ అవకాశాలను దశాబ్దకాలంగా దెబ్బతీస్తూ వస్తున్న ఆమ్​ ఆద్మీ పార్టీ ఓటమిలో.. నిజంగా కాంగ్రెస్ వ్యూహాత్మక​ గెలుపు దాగి ఉందా? 

దేశ రాజకీయాల్లో  ఇపుడు ఇదే ఆసక్తికరమైన చర్చ!  రాజకీయంగా ఆమ్​ ఆద్మీ పార్టీ  రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీని గత పదేండ్లుగా ఉక్కిరిబిక్కిరి చేస్తూ వస్తున్నది. ముఖ్యంగా కాంగ్రెస్,​ బీజేపీల ప్రత్యామ్నాయ రాజకీయాలను బాగా దెబ్బతీస్తూ వచ్చింది. అందులోనూ కాంగ్రెస్​ అవకాశాలనే బాగా దెబ్బతీస్తూ వచ్చిందంటే న్యాయంగా ఉంటుంది. 

కనీసం ఆమ్​ ఆద్మీ పార్టీ అయినా దేశంలో ఆదర్శ రాజకీయాలను నేర్పిందా అంటే అదీ లేదు. సరికదా, మరో రెండు ప్రాంతీయ పార్టీల నేతలను కలుపుకొని  లిక్కర్​ స్కామ్​కు పాల్పడడం చూసి దేశమే ఆశ్చర్యపోయింది. సామాన్యుడిగా జీవిస్తానన్న కేజ్రీవాల్​ సీఎంగా  ‘శీష్​ మహల్’ కట్టుకున్నాడు ఎందుకనే  సామాన్యుడి ప్రశ్నే ఆయన్ను ఓడించడంలో ఒక భాగమైంది. అంతకు మించి, లిక్కర్​ స్కామ్​ వంటి మరకలు ఆయన ఓటమికి బలమైన కారణాలుగా మారాయి.


ఢిల్లీలో, పంజాబ్​లో కాంగ్రెస్​ ఓట్లనే ఆప్​ కొల్లగొట్టి గెలిచిందని అందరికీ తెలిసిందే. 2013లో అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్​ను అవినీతి పరురాలని కేజ్రీవాల్​ దుమ్మెత్తిపోశాడు. నిజానికి ఆమె సమర్థ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కానీ, కేజ్రీవాల్ ​ అన్నాహజారేతో కలిసి లోక్​పాల్​ బిల్లు కోసం ఆయన చేసిన రాజకీయాన్ని ప్రజలు బాగా నమ్మారు. దాంతో పరోక్షంగా ఢిల్లీలో కాంగ్రెస్​ పార్టీ ఓటు బ్యాంకును కేజ్రీవాల్​ ఏకంగా కొల్లగొట్టాడని  చెప్పొచ్చు. పంజాబ్​లోనూ అదే జరిగింది. ఢిల్లీ, పంజాబ్​లో కేజ్రీవాల్ రాజకీయం కాంగ్రెస్​ను బాగా దెబ్బతీసింది. 

కాంగ్రెస్​ గుర్తింపును మసకబార్చింది

పదేండ్లుగా ఢిల్లీ మోడల్​ను కేజ్రీవాల్​ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ, అనేక రాష్ట్రాల్లో  తన పార్టీని పోటీ చేయించారు.  అది బీజేపీ కన్నా, కాంగ్రెస్​కే ఎక్కువ నష్టం చేస్తూవచ్చింది.13శాతం ఓట్లతో గుజరాత్​లో  ఆప్​ 5 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచింది. గోవాలోనూ ప్రభావం చూపింది. మొత్తం మీద దేశంలో ఆప్​ పార్టీ ఏరాష్ట్రంలో పోటీ చేసినా అక్కడ కాంగ్రెస్​ గెలుపుకే అవరోధంగా మారుతూ వచ్చింది. 

కాంగ్రెస్​ ఓట్లకే అది ఎసరు పెడుతూ వచ్చింది. దీంతో  ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్​కు దేశంలో ఉన్న గుర్తింపు.. బాగా మసకబారుతూ రావడానికి ఆమ్​ఆద్మీ పార్టీయే కారణమయిందనడంలో సందేహం లేదు. ఢిల్లీ, పంజాబ్​లో కాంగ్రెస్​ను ఓడించి ఆప్​ అధికారంలోకి రాగలిగింది. 

కానీ, గుజరాత్,​ గోవా లాంటి రాష్ట్రాల్లో తాను గెలవలేదు సరికదా.. కాంగ్రెస్​ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చింది. అంతేకాదు, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్​, ఎంపీ, చత్తీస్​గఢ్​, జార్ఘండ్​, యూపీ, బిహార్​ లాంటి అన్ని హిందీ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​ అవకాశాలకు ఆప్​ గండి కొడుతూ వచ్చిన మాట నిజం. 

కేజ్రీవాల్​ను వెంటాడుతున్న సమస్య

పంజాబ్​లో ఆప్​ ప్రభుత్వంలో సంక్షోభం ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఢిల్లీ ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కేజ్రీవాల్​ పంజాబ్​ ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని పిలిపించుకొని  సమావేశం కావడం మరింత ఆసక్తికరం. ఢిల్లీ ఓటమితో తన ​ నాయకత్వంపై ​పార్టీలో సందేహాలు పెరుగుతాయేమోనని  కేజ్రీవాల్​ ఆందోళన చెందినట్లున్నారు. 

అందుకే పార్టీ ‘బాస్​’ను నేనే అని నిరూపించుకోవడానికే  ఆ సమావేశం ఏర్పరచి ఉంటారని విశ్లేషకుల అభిప్రాయం. ఓటమి తర్వాత ఆమ్​ ఆద్మీ పార్టీపై కేజ్రీవాల్​ పట్టు సడలే అవకాశం లేకపోలేదు. కేజ్రీవాల్​ను ప్రస్తుతం వెంటాడుతున్న సమస్య కూడా అదే.

లిక్కర్​ స్కామ్​లో మూడు ప్రాంతీయ పార్టీలు

అవినీతికి వ్యతిరేకంగా ‘లోక్​పాల్’​  ఉద్యమం నడిపిన కేజ్రీవాల్.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ‘లిక్కర్​ స్కామ్​’ కేసు ముద్దాయిగా మారిన తీరును ఢిల్లీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. 5 నెలలు జైలు జీవితం కూడా గడిపివచ్చారు. ఆయనతోపాటు మరో రెండు ప్రాంతీయ పార్టీల నేతలు కూడా లిక్కర్​ స్కామ్​లో ముద్దాయిలుగా జత కలిశారు. బీఆర్​ఎస్​ అధినేత కూతురు,  వైయస్ఆర్​సీపీకి చెందిన ప్రముఖ నేతలు కూడా ముద్దాయిలుగా జైలు జీవితం గడిపి వచ్చారు. 

లిక్కర్​ స్కామ్​లో ఇరుక్కున్న  వాళ్ల  పార్టీలన్నిటినీ ప్రజలు నిర్ద్వందంగా ఓడిస్తూ రావడం ఆసక్తికరం. తెలంగాణలో బీఆర్​ఎస్,​ ఏపీలో వైయస్​ఆర్​సీపీ, ఢిల్లీలో ఆప్ లను  ప్రజలు వరుస పెట్టి ఓడించడం  గమనించాల్సిన విషయం. కేసీఆర్​తో​  స్నేహం చేసి బలైన ప్రాంతీయ పార్టీలు ఇంకా చాలానే ఉన్నాయి. 

కాంగ్రెస్​లో​ విశ్వాసం

ఢిల్లీ ఆప్​ ఓటమిలో కాంగ్రెస్​ తన గెలుపుగా ఎలా భావిస్తున్నది? అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఢిల్లీలో ఆప్​ ఘోర పరాజయం వల్ల, గతంలో​ కోల్పోయిన తన బలాన్ని కాంగ్రెస్​ తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసం ఆ పార్టీకి ఉండటంలో తప్పు లేదు. ఢిల్లీలో కాంగ్రెస్​కు వచ్చిన ఓట్ల శాతం గతం కంటే 2శాతం అధికంగా 6.5శాతం వచ్చాయి. అలాగే 13 స్థానాల్లో కాంగ్రెస్​ 10 శాతంపైగా ఓట్లను సాధించింది. ఇది ఆప్​ ఓటమికి పరోక్ష కారణంగా విశ్లేషకులు లెక్కలేస్తున్నారు.  వాస్తవానికి కాంగ్రెస్​ సాధించిన 6.5 శాతం ఓట్లలో  కేజ్రీవాల్​ పట్ల వ్యతిరేకతతో వచ్చిన ఓట్లే అధికం. కాబట్టి, ఆప్​ కాంగ్రెస్​తో జత కడితే గెలిచేది అనే వాదన సరికాదు.

ప్రాంతీయ పార్టీలే సమస్యగా మారుతున్నాయి

దేశంలో చాలా  ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతం పట్ల కన్నా, కుటుంబమే ప్రాంతంగా, అవినీతే లక్ష్యంగా మార్చుకొని పనిచేస్తున్నాయి. తమ కుటుంబాల యోగ క్షేమాలే ఫెడరల్​ వ్యవస్థకు నిర్వచనంగా మార్చుకున్నాయి. దేశానికి ఇదో అనర్థంగా మారింది. జాతీయ ప్రత్యామ్నాయానికి అడ్డుగోడలుగా మారిపోయాయి. ఇవాళ లోక్​సభలో 42 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఫలితంగా పార్లమెంటులో ఒక బలమైన జాతీయ ప్రతిపక్షం లేకుండాపోయింది. 

దేశ రాజకీయాల్లో ఇదో అనారోగ్యకరమైన పరిస్థితి దాపురించింది. దేశంలో  ప్రాంతీయ పార్టీలతో ఫెడరలిజం బలపడడం అనేది ఒక భ్రమగా మారింది. ఫెడరలిజం ముసుగులో అవినీతి, ఆశ్రిత పక్షపాతాలతో రాజ్యమేలుతూ జాతీయ ప్రత్యామ్నాయానికి ఎసరు  పెడుతున్నాయి.  అవినీతిరహిత పాలన పేరు చెప్పి​ లిక్కర్​ స్కామ్​లో ఇరుక్కున్న  ఒక కేజ్రీవాల్​ను  ప్రజలు చూశారు. బంగారు తెలంగాణ పేరిట.. కాళేశ్వరం నుంచి గొర్రెల స్కామ్​ దాకా విచారణను ఎదుర్కొంటున్న కేసీఆర్​నూ ప్రజలు చూశారు. 

రెండు జాతీయ ప్రత్యామ్నాయ పార్టీలుగా బీజేపీతో సమానంగా కాంగ్రెస్​ బలపడడం ఈ దేశానికి చాలా అవసరం. అది బీజేపీ రాజకీయ ఆరోగ్యానికి కూడా మంచిదే. ప్రశ్నించే బలమైన ప్రతిపక్షం ఉన్నపుడు  అధికార పక్షం మరింత సుపరిపాలన అందించే అవకాశం ఉంటది.  ఫలితంగా  బీజేపీ, కాంగ్రెస్​ జాతీయపార్టీలు, మిగతా ప్రాంతీయ పార్టీల కన్నా మెరుగ్గా పనిచేయగలుగుతాయి.

 దేశం కోరుకుంటున్నది కూడా అదే. ఏదిఏమైనా, ఒక భిన్నమైన పార్టీగా అవతరించిన ఆమ్​ ఆద్మీ పార్టీ  తాను ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మించలేకపోయినా.. దేశంలో రెండు ప్రత్యామ్నాయ పార్టీల నిర్మాణాన్ని మాత్రం చెరిపేస్తూ వచ్చింది. ఇది దేశ ఆరోగ్యకర రాజకీయాలకు చేటు చేసింది  తప్ప మంచి చేయలేకపోయింది. 

కాంగ్రెస్​, బీజేపీలే ప్రత్యామ్నాయాలు  

మోదీ పాపులారిటీకి ఇబ్బంది కలిగించిన లోక్​సభ ఫలితాల ప్రభావం ఇపుడు పాతబడిపోయింది. ఇపుడు హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో వరుస విజయాలతో ప్రధాని మోదీ తిరిగి యశస్వీ ప్రధానిగా పాపులర్​ ట్రాక్​లోకి వచ్చేశాడు.  ప్రస్తుతం బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిపి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇది  ఒకప్పుడు ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్​ ఏకపక్ష గెలుపులతో సమానం.  కానీ, దురదృష్టవశాత్తు బీజేపీకి దేశంలో బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన కాంగ్రెస్​ పార్టీ బలహీనంగా ఉంది. 

 దేశంలో  కేజ్రీవాల్​లు,  కేసీఆర్​లు పెరిగిపోయిన పరిణామం అది. దేశానికి బలమైన రెండు జాతీయ పార్టీలు మాత్రమే కొంతమేరకైనా రాజకీయాలను ఆరోగ్యకరంగా నడప గలుగుతాయి.  దేశంలో ఒక జాతీయ పార్టీ బలంగా ఉండటం, మరో జాతీయ పార్టీ బలహీనంగా ఉండటమే పెద్ద సమస్య. దాన్ని అధిగమించాలంటే, ఢిల్లీలో  
ఆప్​ ఓటమిలో కాంగ్రెస్​  తన గెలుపు చూసుకుంటే తప్పేమీ కాదు.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి,పొలిటికల్​ ఎనలిస్ట్​-