ఓపినియన్ :బి.జోసెఫ్
దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సర్వశక్తిమంతుడైన ఆయన ఈ భూమిపై అన్ని సౌకర్యాలను సృష్టించి, వాటిని వాడుకొని బుద్ధిమంతులుగా ఉండాలని మనిషిని తన ప్రతినిధిగా పుట్టించాడు. పరిశుద్ధులుగా, తనకు విధేయులుగా జీవించాలని ఆశించాడు. అయితే ఆదిమానవులైన ఆదాము, అవ్వ.. సాతాను వల్ల చెడిపోతారు. పేరెంట్స్ తమ పిల్లలను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు. వాళ్లు పెద్ద చదువులు చదివి, మంచి జాబులు సంపాదించి సుఖంగా,సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.
కానీ.. నేడు చాలామంది పిల్లలు ఆదాము, అవ్వల మాదిరిగా సమాజంలోని చెడును స్వీకరిస్తూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తినకూడనివి తింటున్నారు. తాగకూడనివి తాగుతున్నారు. పెద్దల మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ వాళ్లకు ఆగ్రహం తెప్పిస్తున్నారు. దేవుడి ఆజ్ఞను అతిక్రమించటం పాపమని, దాని ఫలితం మరణమని బైబిల్ చెబుతోంది . పక్కదారిపట్టిన వాళ్లు ఎవరైనా చివరికి పొందేది అదేననేది ఆ పవిత్ర గ్రంథం సారాంశం.
తాను పుట్టించిన మానవుడు పాడైపోవటం దేవుడి చిత్తం కాదు. అందుకే ప్రవక్తలను, దైవ జనులను పంపి, వారి బోధనలతో మనుషులు మారు(మంచి) మనసు పొందే అవకాశం కల్పించాడు. తల్లిదండ్రులు కూడా అంతే. తమకు పుట్టిన సంతానం ఆనందంగా, నిండు నూరేళ్లు ఉండాలనుకుంటారే గానీ కలలోనైనా, కోపంలోనైనా మరో విధంగా అనుకోరు. తప్పులను సరిచేసుకొనే ఛాన్సులు ఎన్నయినా ఇస్తారు. బంధువులతో, మిత్రులతో నచ్చజెప్పే ప్రయత్నాలూ చేస్తారు.తమ పిల్లలు ఎప్పటికైనా మారతారని నూటికినూరు శాతం నమ్ముతారు.
గుండెను రాయిగా మార్చుకొని, వినయ విధేయతలను మర్చిపోయిన మానవులు ప్రవక్తల బోధనలను పెడచెవిన పెట్టారు. పాపాలను దూరం చేసుకునేందుకు పశువులను, పక్షులను బలిపెట్టారు. ఈ క్రమంలో దైవాజ్ఞలను మరీ ఎక్కువ అతిక్రమించి లోకమంతా పాపాన్ని విస్తరింపజేశారు. అలాగే ప్రస్తుతం కొందరు పిల్లలు తమ బాగు కోరేవాళ్ల మాటలను పట్టించుకోవట్లేదు. గట్టిగా చెప్పబోతే నొచ్చుకుంటున్నారు. ఒక్కోసారి.. సూసైడ్ చేసుకుంటామని బెదిరించటానికి కూడా వెనకాడట్లేదు .దేవుడు కరుణామయుడు, ప్రేమమూర్తి కావటం వల్ల మనుషులను పాపాల నుంచి విముక్తి చేసేందుకు రెండు వేల ఏళ్లకు పూర్వం స్వయంగా మానవ రూపంలో, పశువుల పాకలో జన్మించాడు. ఈ లోకంలో ముప్పై మూడున్నరేళ్లు జీవించి,మనుషులకు పాపాల నుంచి విముక్తి కల్పించటానికి సిలువపై రక్తాన్ని చిందించాడు. కొందరు పిల్లలు చేసే తప్పుడు పనులకు, నేరాలకు, ఘోరాలకు వాళ్లను కన్నవాళ్లు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
ప్రభువు తనను శిక్షిస్తున్నవారిని కూడా క్షమించమని తండ్రి అయిన దేవుణ్ని ప్రార్థించాడు. భగవంతుడి ప్రణాళిక ప్రకారం.. చనిపోయిన మూడోరోజు సమాధి నుంచి సజీవంగా లేచాడు. యేసు సిలువపై మరణించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా, ఆయన మళ్లీ బతికిన రోజును ఈస్టర్ గా భక్తితో జరుపుకుం టారు. తల్లిదండ్రులు దైవంతో సమానం. వాళ్లను నొప్పించకుండా, ఏసుక్రీస్తు బోధనలను ఆచరణలో పెడితే ప్రతిఒక్కరికీ ప్రతిరోజూ ‘గుడ్’ ఫ్రైడే అవుతుంది. ‑ బి.జోసెఫ్, హైదరాబాద్