పరిపూర్ణ జాతీయవాది వాజ్​పేయి

పరిపూర్ణ జాతీయవాది వాజ్​పేయి

‘‘ఈ దేశం కేవలం ఒక భూభాగం కాదు, ఒక సజీవ జాతి, పుణ్యభూమి.. భారత్ కోసం నా జీవితాన్ని త్యాగం చేసేందుకు గర్వపడతాను’’ అని చెప్పిన పరిపూర్ణ జాతీయవాది వాజ్​పేయి. తాను జీవించి ఉన్నంత కాలం తరచు ఇదే మాటను చెప్పారు. సుపరిపాలనతో నవభారత నిర్మాణానికి పునాది వేసిన సూత్రధారి వాజ్​పేయి. జనాల్లో చైతన్యం నింపుతూ ఆయన ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారి దాన్ని కాపాడేందుకు గొంతెత్తారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా విలువలతో రాజకీయాలు నడిపారు. అందుకే అటల్​జీ ఈ గడ్డకు ఆత్మీయ బంధువు. ఆ మహనీయుని జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

సిద్ధాంత నిబద్ధత, అభివృద్ధి రాజకీయాలకు మరో పేరు అటల్ బిహారి వాజ్ పేయి. స్వతంత్ర భారతదేశంలో ఆయనలాంటి రాజనీతిజ్ఞుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. భారతీయ జనతా పార్టీని పునాదుల నుంచి నిర్మించడంలో, కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి పార్టీని ముందుకు నడిపించడంలో వాజ్ పేయి కృషి ఎనలేనిది. ఆయన దార్శనికత కలిగిన నాయకుడే కాదు.. రచయిత, పాత్రికేయుడు, గొప్ప పార్లమెంటేరియన్, అద్భుత వక్త. వాజ్​పేయి సుపరిపాలనా విధానాల ప్రభావం మోడీ ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం, దళారీ వ్యవస్థ లేని పాలన మార్గదర్శకాలుగా ప్రజల భాగస్వామ్యంతో సుపరిపాలన అందించే దిశగా మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

ఆర్య సమాజ్​ నుంచి జనసంఘ్​లోకి..

అటల్​ బిహారి వాజ్​పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్​లో 1924 డిసెంబర్ 25న సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా బింద్, గ్వాలియర్ లోనే సాగింది. కాన్పూర్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. 1939లో ఆర్య సమాజ్ విద్యార్థి విభాగం ఆర్యకుమార్ సభలో వాజ్​పేయి చేరారు. 1944లో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్​లోనూ చేరారు. 1947లో పూర్తి స్థాయి ప్రచారక్ గా మారి.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాస పత్రిక రాష్ట్ర ధర్మ్, వారపత్రిక పాంచజన్యతోపాటు స్వదేశ్, వీర్ అర్జున్ వంటి దినపత్రికల్లోనూ పని చేశారు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్ లో దీన్ దయాళ్​ ఉపాధ్యాయతో కలిసి చేరారు. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు శ్యామాప్రసాద్ ముఖర్జీ ముఖ్య అనుచరునిగా ఎదిగారు. 

చిన్నవయసులోనే పార్లమెంటుకు..

ఇటుక ఇటుక పేర్చుకుంటూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిర్మించుకోవాల్సిన సమయంలో ప్రతిపక్షాల తరఫున గళం విప్పాల్సిన మహత్తరమైన బాధ్యత 30 ఏండ్లు సైతం నిండని యువకుడిపై పడింది. ఆయనే అటల్ జీ. అంత చిన్న వయసులోనే హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ ప్రజలను తన ప్రసంగాలతో సమ్మోహితులను చేసేలా ఉపన్యసించగల సామర్థ్యం ఉన్న నాయకుడిగా వాజ్​పేయి గుర్తింపు పొందారు. ముఖర్జీ తర్వాత జనసంఘ్ నిర్మాణ బాధ్యత లను భుజాలకెత్తుకొన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్.. మొదటి లోక్​సభలో ముఖర్జీ లేని లోటును భర్తీ చేయడానికి వాజ్​పేయీని ఎంపిక చేశారు. 1955లో లక్నో ఉపఎన్నికలో తొలిసారిగా లోక్​సభకు పోటీ చేసి వాజ్ పేయి ఓడిపోయారు. తన అవిశ్రాంత కృషితో 1957లో 33 ఏండ్ల వయసులో రెండో లోక్​సభలో వాజ్​పేయి పార్లమెంట్​లో అడుగుపెట్టారు. అటల్​జీ తన రాజకీయ ప్రస్థానంలో పది సార్లు లోక్​సభకు ఎన్నికయ్యారు. 47 ఏండ్ల సుదీర్ఘ కాలం పాటు పార్లమెంటేరియన్‌‌‌‌గా సేవలందించారు. 1962, 1986లో రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా యునైటెడ్​ నేషన్స్​సమావేశంలో రాజ్యభాషలో ప్రసంగించి భారతావని వాణిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనింపజేసిన ఘనాపాటి మన వాజ్​పేయి.

ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు

1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫలితంగా ప్రజాస్వామ్యం అణచివేతకుగురైంది. అగ్ర నాయకులంతా 18 నెలలు మీసా చట్టం కింద జైలు పాలై నిర్భంధానికి గురయ్యారు. 1975 నుంచి 1977 మధ్య కాలంలో ప్రపంచం నివ్వెరపోయేలా ప్రజాస్వామ్యం పీక నులిమిన ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా వాజ్​పేయి తీవ్రంగా పోరాడారు. సుదీర్ఘకాలం పాటు జైలు శిక్ష అనుభవించారు. ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా దాన్ని కాపాడేందుకు ఆయన ముందడుగు వేసేవారు. ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి అవిరళ కృషి చేశారు. 1959లో టిబెట్ పై పార్లమెంట్ లో చేసిన ప్రసంగం, ప్రధానిగా ఉన్నప్పుడు ఛలోక్తులతో, కవితలతో పార్లమెంట్ లో చేసిన ప్రసంగాలు, ఫోఖ్రాన్ అణు పరీక్షలప్పుడు ఆయన చేసిన ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. 1960 మార్చిలో దలైలామా శరణార్థిగా వచ్చినప్పుడు, లడాఖ్​లో చైనా దురాక్రమణ బయటపడ్డప్పుడు వాజ్​పేయి ఉపన్యాసాలు లోకసభను కుదిపేశాయి. 

మూడుసార్లు ప్రధానిగా..

అటల్​జీ మూడుసార్లు ప్రధానమంత్రిగా దేశానికి సేవలను అందించారు. 1996 జనరల్​ ఎలక్షన్స్ లో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. వాజ్​పేయి తొలిసారిగా ప్రధానమంత్రి పదవి చేపట్టారు. అయితే 13 రోజులకే ఆయన పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. పదవి కోసం అవినీతికి పాల్పడటం ఇష్టం లేదని ఈ సందర్భంగా పార్లమెంట్​లో ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో నిలిచిపోతుంది. 1996 నుంచి 1998 మధ్య రెండుసార్లు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తర్వాత లోక్​సభ రద్దై మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ బీజేపీతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే)గా ఏర్పడ్డాయి. వాజ్​పేయి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం కొనసాగింది. సంకీర్ణంలో భాగస్వామైన జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించడంతో వాజ్​పేయి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది. ఎన్నికలు జరిగేంత వరకూ వాజపేయి ప్రధానిగా కొనసాగారు. ఒక్క ఓటుతో మెజారిటీ కోల్పోయి ప్రధాని పదవిని త్యాగం చేసి విలువలతో కూడుకున్న రాజకీయాలకు కట్టుబడ్డారు.

నిరంతరం ప్రజలకు చేరువగా..

1957లో ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన వాజ్​పేయి తొలిసారిగా లోక్​సభకు వెళ్లారు. ఆయన వాగ్ధాటి, సంస్థాగత నైపుణ్యాల కారణంగా 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రొఫెసర్ బాల్ రాజ్ మాధోక్, నానాజి దేశ్ ముఖ్, లాల్ కృష్ణ అద్వానీతో కలిసి జనసంఘ్ ను జాతీయస్థాయిలో బలోపేతం చేసే దిశగా నడిపించారు. అటు మేధోపరమైన బాధ్యతలను, ఇటు సంస్థాగతమైన కార్యకలాపాలను సమాన సామర్థ్యంతో నిర్వహించారు. కొత్తగా సభ్యులను చేర్చుకోవడానికి, కార్యకర్తలను కలవడానికి జనసంఘ్​ ఆలోచనలు, సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడానికి నిరంతరం శ్రమించారు. ఇందుకోసం వందల కిలోమీటర్లు సైకిల్ పైనే ప్రయాణించారు. పార్టీ నిధుల సమీకరణకు దేశవ్యాప్తంగా తిరగడం వరకు ఆయన ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారు. అద్వానీ, బైరాంసింగ్​ షెకావత్​తో పాటు జనసంఘ్, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సహచరులను కలుపుకుని 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. తన నిర్విరామ కృషితో కేంద్రంలో అధికారం చేపట్టే స్థాయికి దానిని చేర్చారు.

సాహసోపేతమైన నిర్ణయాలు

కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన 1999 లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీయే స్థిరమైన మెజారిటీ పొందడంతో మూడోసారి ప్రధానమంత్రిగా వాజ్​పేయి బాధ్యతలు చేపట్టి 2004 వరకు నిరాటంకంగా పాలించారు. మన దేశంపై వివిధ రంగాల్లో చెరగని ముద్ర వేశారు. ఫోఖ్రాన్​ లో అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించినా, బస్సులో పొరుగు దేశానికి వెళ్లి స్నేహ హస్తం అందించినా అది ఆయనకే చెల్లింది. దాయాది దేశంతో సత్సంబంధాలకు పరితపించిన వాజ్ పేయి.. కార్గిల్ యుద్ధంతో గట్టి సమాధానం ఇచ్చి ఇండియా సత్తాను ప్రపంచానికి చాటారు. ఇలా ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం అటల్​జీకే సాధ్యమైంది. 1998 మేలో దేశ రక్షణ సన్నద్ధత కోసం ఎంతో కీలకమైన ఫోఖ్రాన్-2 అణు పరీక్షను నిర్వహించడంలో ఆయన అత్యంత పట్టుదలతో, జాగరూకతతో వ్యవహరించారు. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అటల్​జీ పాటుపడ్డారు. లుక్ ఈస్ట్ విధానంలో భాగంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో బంధాలు బలపడేలా చేశారు. అమెరికా, చైనా, రష్యాతో సత్సంబంధాలు కొనసాగించారు.

సుపరిపాలనకు ఆద్యుడు

దేశంలో ఆర్థిక సంస్కరణల అమలులో కూడా ప్రజల విస్తృత ప్రయోజనాలకు వాజ్​పేయి పెద్దపీట వేశారు. ఆయన దూరదృష్టి ఫలితంగానే టెలి కమ్యూనికేషన్ విస్తరణ, స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారుల అభివృద్ధి జరిగింది. ఆయన వ్యూహాత్మక అడుగుల కారణంగానే దేశంలో మౌలిక వసతుల కల్పన జోరందుకుంది. 2001లో ప్రారంభించిన సర్వ శిక్షా అభియాన్ పథకం చదువుకునే పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచడమే కాకుండా విద్యలో నాణ్యతకు అవకాశం కల్పించింది. ఆయన దార్శనికతకు మరో నిదర్శనం నదుల అనుసంధానం. గ్రామాలను అనుసంధానం చేసే సడక్ యోజన ద్వారా ఉపాధి అవకాశాలు ముమ్మరమయ్యాయి. జై జవాన్, జై కిసాన్ కు అటల్​జీ జై విజ్ఞాన్ ను జోడించి వైజ్ఞానిక రంగం ప్రాధాన్యతను చాటిచెప్పారు. 2002లో వాజ్​పేయి ప్రభుత్వం పారదర్శక పాలనకు మూలస్తంభం లాంటి సమాచార హక్కు చట్టానికి పూర్వ రంగం లాంటి ది ఫ్రీడం ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్-2002 తెచ్చింది. అయోధ్య రామమందిరం వివాదానికి న్యాయ ప్రక్రియ ద్వారా లేదా పరస్పర ఆమోదయోగ్యమైన చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్న ఆయన దిశానిర్దేశం జాతి సమగ్రతకు గొడుగు పట్టింది. 2005లో రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించిన అటల్​జీ.. 2018 ఆగస్టు 16న కన్నుమూసారు. వాజ్​పేయి పుట్టిన రోజైన డిసెంబర్​ 25ను సుపరిపాలన దినంగా 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆయన స్ఫూర్తితోనే సుపరిపాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలు, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయడం ఇందుకు నిదర్శనం.

- డా. కె.లక్ష్మణ్, 

బీజేపీ ఓబీసీ మోర్చా, జాతీయ అధ్యక్షుడు