డైనమిక్ లీడర్ .. కొత్త సీఎం గుడ్​ గవర్నెన్స్

డైనమిక్ లీడర్ ..  కొత్త సీఎం గుడ్​ గవర్నెన్స్

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజయం సాధిస్తాడు. ఈ డైలాగ్  తెలుగులో పాపులర్ హీరో సిన్మాలోనిది. వీటినే  రాజకీయాల్లో అప్లయ్ చేస్తే మనకు కన్పించే నాయకుడు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండు నెలల్లోనే సీఎంగా తనేంటో..నిరూపించుకున్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఏదీ ఉచితంగా రాలేదు. ప్రతిదీ పోరాడే సాధించుకున్నాడు. ప్రతి దగ్గర ఓ పాఠం నేర్చుకున్నాడు. పార్టీ పట్ల ప్రజల్లో అభిమానం ఉన్నా, దాన్ని ఓ తాటిపైకి తెచ్చే నాయకుడు ఎవరు అని సందేహిస్తున్న సమయంలో  రాహుల్ గాంధీకి వజ్రాయుధంలా దొరికిన  డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ  తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నాడు. తనపై విమర్శలు చేసిన వారి పట్ల కూడా చాలా ఉదారంగా వ్యవహరించాడు.  కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛకు తనే నిదర్శనమని చెప్పారు.  అట్లా తనను తాను చాలా సందర్భాల్లో తగ్గించుకుంటూ పార్టీఉన్నతికి ప్రయత్నం చేశారు.  రాహుల్ గాంధీ, సోనియాగాంధీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తనతో బెట్టు చేసిన వారి విషయంలో  ఒకటి కాదు రెండు మెట్లు కూడా కిందికి దిగారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం చేశారు.

 
స్వయం పాలనకు  అసలు నిర్వచనం ఇవ్వాలని  కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి భుజాలపై పెట్టింది.  గతంలో  బీఆర్ఎస్ నాయకులు చెప్పినవే కాదు, చెప్పనవీ చేశామని డబ్బా కొట్టుకునేవారు. వారు  ఆత్మగౌరవం  అనే మాటను పాతాళంలో పాతేశారు. దాన్ని  కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం బలంగా  పైకి తెచ్చింది. బెర్లిన్ గోడలు బద్దలై జర్మనీ ఏకీకరణ జరిగినట్లుగా, తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యనున్న ఉక్కు  కంచెలు చట్ మని ఎగిరిపోయాయి.  ఆరోజే  ప్రజా పాలనకు పునాది పడింది. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. ప్రచార, ప్రసార మాధ్యమాలతో పాటు  సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తం  చేసింది. 

సమష్టి పాలన తెచ్చారు

 రాష్ట్ర అసెంబ్లీలో తాను మాట్లాడేదానికంటే కూడా తన  సహచర మంత్రులతోనే చాలా  విషయాలు మాట్లాడించారు. ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం  మంత్రులే ప్రవేశపెట్టారు. వారే  చర్చను ప్రారంభించారు. ప్రజల ముందు వాస్తవాలు పెట్టారు. అంతేకాదు గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా విపక్ష సభ్యులు కూడా చర్చలో పాల్గొనాలని, అదే  నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అని చెప్పారు. సభలో ఆచరించి చూపించారు.  ఈ అన్ని సందర్భాల్లో తాను  ముఖ్యమంత్రినని.. పార్టీ అధికారంలోకి రావడానికి  కీలక పాత్ర పోషించాననే విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలో కాదు.. తగ్గడం కూడా తెలుసు కాబట్టి. తన కంటే పార్టీ ముఖ్యమని,  ప్రజా పాలన ముఖ్యమని గుర్తించిన నాయకుడు ఆయన.

కేంద్ర నిధులూ సాధిస్తున్నారు

 పంతాలకు, పట్టింపులకు పోకుండా రాష్ట్ర ప్రగతి కోసం,  ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న రేవంత్​రెడ్డికి అంతటా ప్రశంసలే లభిస్తున్నాయి.  గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు, పన్నుల్లో వాటా రాలేదని  గత నాయకులు  చాలా సందర్భాల్లో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం  సహకరించడం లేదని అన్నారు. కానీ   రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయ్యారు.  కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా సరే, రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన నిధుల విషయంలో విజయం సాధించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమయ్యే నిధులను రాబట్టుకున్నారు.  కేంద్రం హోం మంత్రిని  ఒప్పించి అవసరం మేరకు ఐపీఎస్​లను కేటాయించేలా చేశారు. కేంద్రంతో సఖ్యత కుదుర్చుకుని మెహదీపట్నంలో స్కైవే గురించి చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరించేలా చేశారు. రాష్ట్ర గవర్నర్ అభిమానాన్ని చూరగొన్నారు. తాను పంపిన ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో అదే జరిగింది. టిఎస్ పీఎస్సీ చైర్మన్. సభ్యుల విషయంలో కూడా గవర్నర్ నుంచి వెంటనే ఆమోదం లభించింది. గత ప్రభుత్వంలో ప్రతిదీ వివాదమే అయింది. ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ నెగ్గాలో కాదు, ప్రజల కోసం ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు కాబట్టే తెలంగాణలో రెండు నెలల పాలన  పూర్తి  కాకుండానే అద్భుత విజయాలు సాధ్యం అవుతున్నాయంటే కారణం అదే. అధికారం పోయి అసహనం పెంచుకున్న బీఆర్​ఎస్​ నేతలు తప్ప, కొత్త సీఎం గుడ్​ గవర్నెన్స్​కు అంతటా ప్రశంసలే లభిస్తుండటం గమనార్హం.

పెట్టుబడులు తెస్తున్నారు

మన రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభం అయి రెండు నెలలు కూడా నిండలేదు. కానీ ఈ మధ్యనే ప్రజల కోసం  ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడుల గురించి వార్తలు తెలుగు పత్రికల నిండా వచ్చాయి. తొలిసారి విదేశీ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి రూ. 40వేల కోట్ల  పెట్టుబడులు తీసుకొచ్చారు. నాలుగైదు భాషలు రావడం కంటే.. వాటిని ప్రచారం చేసుకోవడం కంటే.. ప్రజల కోసం ఏం చేశామన్నదే ముఖ్యం. కాబట్టి రాష్ట్ర  ప్రజల కోసం ఆయన,  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు తన శక్తి వంచన లేకుండా  ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల గురించి  సహజంగా ముఖ్యమంత్రులే చెబుతుంటారు. కానీ, రేవంత్ రెడ్డి తమ కేబినెట్  నిర్ణయాలను మంత్రులే చెప్తున్నారు. ఈ విషయంలో కూడా రేవంత్ ఓ  మెట్టు తగ్గే ఉంటున్నారు. కారణం, ప్రజా పాలన ముఖ్యం, వ్యక్తులు కాదనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. 

-  చల్లా తేజ, కాంగ్రెస్ నాయకుడు