ఐఏఎస్ ఆఫీసర్ల కొరత తీర్చడానికి సర్వీస్​ నిబంధనలను సవరించాలి

ఐఏఎస్ ఆఫీసర్ల కొరత తీర్చడానికి సర్వీస్​ నిబంధనలను సవరించాలి

కేంద్రంలో వివిధ స్థాయిల్లో ఐఏఎస్ ఆఫీసర్ల కొరతను తీర్చడానికి ఐఏఎస్ సర్వీస్​ నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. అయితే ఈ చర్యపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేసినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుత కేటాయింపు కింద ఐఏఎస్ ఆఫీసర్లు స్వచ్ఛందంగా రాష్ట్రాల నుంచి కేంద్ర డిప్యుటేషన్ ను ఎంచుకుంటారు. ఈ అధికారులను ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులకు, భవిష్యత్ లో ఏర్పడే ఖాళీ పోస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అలా చేసేటప్పుడు, గత అనుభవం ఆధారంగా సదరు అధికారి ఎక్కడ సరిగ్గా సరిపోతారనే సానుకూలతను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఎంపిక ఖరారు కాగానే సంబంధిత అధికారిని రిలీవ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ విషయంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక నిర్దిష్ట కోటా ఉంటుంది. దానిని మించి అదనంగా ఐఏఎస్​ ఆఫీసర్లను కేంద్రం అంగీకరించదు. మన ఫెడరేషన్​లో సుపరిపాలనను అందించాలంటే కేంద్రం, రాష్ట్రాలు కలిసి చేయాలి.

తగ్గిన సెంట్రల్​ డిప్యుటేషన్లు
కేంద్ర డిప్యుటేషన్​ను ఎంచుకునే అధికారుల సంఖ్య గత దశాబ్దంలో క్రమంగా తగ్గింది. 60వ దశకంలో అండర్ సెక్రటరీ స్థాయిలో కూడా అనేక మంది ఐఏఎస్ అధికారులు ఉండగా, ఇప్పుడు జాయింట్ సెక్రెటరీ స్థాయిలో కూడా తగినంత మంది ఐఏఎస్ అధికారులను పొందడం కేంద్ర ప్రభుత్వానికి కష్టంగా మారుతోంది. సాధారణంగా, రాష్ట్రాల మొత్తం కేడర్ బలంలో సుమారు 25 శాతం నుంచి 30 శాతం కేంద్ర డిప్యుటేషన్ లో ఉండేవి. కానీ, ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువ మంది ఐఏఎస్ అధికారులే వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య 8 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంది. గతంలో అయితే సెంట్రల్ డిప్యుటేషన్​కు వెళ్లడం ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఇది అధికారి సామర్థ్యానికి గుర్తింపుగా అప్పట్లో పరిగణించేవారు. ఆ సమయంలో ఎంపిక ప్రక్రియ కూడా చాలా కఠినంగా ఉండేది. సెంట్రల్ డిప్యుటేషన్ కోసం అధికారులు అందుబాటులో లేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే దశాబ్దంన్నర క్రితం చాలా సంవత్సరాల పాటు సరిపడా నియామకాలను చేపట్టకపోవడమే. అలాగే, ఇంకో ముఖ్యమైన కారణం ఏమిటంటే రాష్ట్రాల్లో ఉన్న మెరుగైన సేవా పరిస్థితులు కూడా అధికారులు సెంట్రల్​ డిప్యుటేషన్​ను ఎంచుకోకుండా చేస్తోంది. అయితే సర్వీస్​ నిబంధనల్లో ఏ మార్పులు చేసినా కేంద్ర, రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల కొరత సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. రాష్ట్రంలో అధికారుల కొరత ఉంటే కేంద్ర ప్రభుత్వం దానిని గుర్తించాలి. సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్రంతో ఒక సర్దుబాటును కేంద్రం చేసుకోవాలి. అలాగే రాష్ట్రాలపై కూడా ఇలాంటి బాధ్యతే ఉంటుంది.

లోపాలను సవరించడానికే..
సర్వీస్​ నిబంధనల్లో ప్రతిపాదిత మార్పులను పై కారణాలతో స్పష్టంగా తప్పు పట్టలేము. ఒక లోపాన్ని సరిచేయడం లక్ష్యంగా కేంద్రం వీటిని రూపొందించింది. రాష్ట్రాల కేడర్ బలాన్ని నిర్ణయించేటప్పుడు 40 శాతం సీనియర్ పోస్టులను సెంట్రల్ డిప్యుటేషన్ కోసం కేటాయిస్తారు. కాబట్టి, కేంద్రం అవసరాలను తీర్చడానికి రాష్ట్రాలు నిర్దిష్ట సంఖ్యలో పోస్టులను ఉంచడానికి నియామకం, పోస్టుల మంజూరులో అంతర్గత నిబంధన ఉంది. గతంలో నియామకాలు సరిపోవన్న అభిప్రాయంతో ప్రతిపాదించిన నిబంధన మార్పు కేంద్రం, రాష్ట్రాల మధ్య కొరతను సమానంగా పంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఖాళీలను సకాలంలో భర్తీ చేయాల్సి ఉంటుంది కనుక, రాష్ట్రాలు స్పందించి ఎంపిక చేసిన ఐఏఎస్​ అధికారిని సెంట్రల్​ డిప్యుటేషన్​పై రిలీవ్ చేయడానికి సమయ పరిమితి కూడా ఉంటుంది.

కేంద్రానికి ఎలాంటి పాత్రా ఉండదు
అయితే ఇక్కడ రాష్ట్రాల నుంచి వచ్చే అభ్యంతరాలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్​ డిప్యుటేషన్ కోసం ఇవ్వాలనుకుంటున్న అధికారుల జాబితాను రాష్ట్రాలతో చర్చలో, అది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదన మాత్రమే అని స్పష్టంగా తెలియజేయాలి. ఇది రాష్ట్రాల ప్రతిపాదన మాత్రమే అవుతుంది. తొలుత రాష్ట్రం తన సొంత అవసరాలను పరిశీలిస్తుంది. ఆ తర్వాత గతంలో నియామకంలో కొరతను సమానంగా పంచుకోవడానికి సెంట్రల్​ డిప్యుటేషన్ కోసం పేర్లను అందిస్తుంది. సెంట్రల్ డిప్యుటేషన్ కోసం అందించాల్సిన ఐఏఎస్ అధికారుల జాబితా తయారీలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదు. ఒక ఐఏఎస్ అధికారిని తన దగ్గర ఉంచుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచిస్తుంది. రెండు పక్షాలు అంగీకరిస్తే, ఐఏఎస్ అధికారిని సెంట్రల్ డిప్యుటేషన్​లో ఉంచుతారు. ఒకవేళ రాష్ట్రం ఆ పేరును డిప్యుటేషన్​కు సూచించడానికి ఇష్టపడకపోతే, కేడర్ నిబంధనల ప్రకారం అధికారం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారి అభిప్రాయాలను గౌరవిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి అధికారాన్ని ఉపయోగించడం ప్రతికూలమని గత అనుభవాలు నిరూపించాయి. దీని వల్ల మంచి కేడర్ మేనేజ్ మెంట్ అనేది ఉండదు.

పని పరిస్థితులను మెరుగుపరచాలి
డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి అధికారులకు పని పరిస్థితులను మెరుగుపరచడం కేడర్ మేనేజ్ మెంట్ విజయంలో కీలకమని కేంద్ర ప్రభుత్వం గ్రహించాలి. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు తమ సుముఖతను చూపించి, కేంద్ర డిప్యుటేషన్ ను ఎంచుకుంటే, రాష్ట్రాలకు పేర్లు ఇవ్వడానికి ఒత్తిడి ఉంటుంది. కానీ, డిప్యుటేషన్​ తీసుకునేవారు తక్కువగా ఉంటే, రాష్ట్రం ఢిల్లీకి వెళ్లడానికి అధికారులను బలవంతం చేయాల్సి వస్తుంది. ఈ స్థాయిలో చాలా మంది ఐఏఎస్ అధికారులకు తమ పిల్లల విద్య, రవాణా, ఢిల్లీలో అధిక జీవన వ్యయం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉంటుంది. ఢిల్లీలో సెంట్రల్​ డిప్యుటేషన్ కాలానికి డిప్యుటేషన్ అలవెన్స్ ఇవ్వడం ఒక పరిష్కారం కావచ్చు. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)తో కలిసి సంస్కృతి వంటి ప్రసిద్ధి చెందిన విద్యా సంస్థల్లో ప్రవేశాలను కల్పించడం ద్వారా వారి పిల్లల విద్యకు భరోసా ఇవ్వవచ్చు.

ప్రభుత్వ రంగ సీనియర్​ ఆఫీసర్లకు చాన్స్​ ఇవ్వాలి
రాష్ట్రాలు కూడా ఈ సమస్యను ప్రతికూలంగా కాకుండా సానుకూల ధృక్పథంతో చూడాలి. కేంద్రం, రాష్ట్రం రెండింటి అవసరంగా పరిగణించి సమస్యను పరిష్కరించాలి. ప్రతిపాదిత సవరణ ఐఏఎస్​ ఆఫీసర్ల కొరతను తీర్చడానికి, అవసరమైన చోట పంచుకోవడానికి ఒక యంత్రాంగాన్ని సూచిస్తోంది. అలాగే అధికార దుర్వినియోగం గురించి రాష్ట్రాల భయాలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి. రాబోయే సంవత్సరాల్లో కేంద్రానికి డీఎస్, డైరెక్టర్ స్థాయిలో కొరత ఉంటుంది. సీనియర్ ప్రభుత్వ రంగ అధికారుల ద్వారా ఈ కొరతను కొంత తీర్చడానికి ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలించాలి. వారిలో చాలా మంది ఎంతో అర్హత కలిగి ఉన్నారు. వారు రెండు సంవత్సరాల పాటు సెక్రటరీ స్థాయిలో పని అవసరాలను తీర్చగలరు.

- బీకే చతుర్వేది, సెంట్రల్​ కేబినెట్ మాజీ కార్యదర్శి