మెట్రో ప్రయాణికులకు గుడ్​న్యూస్ : 3 ఆఫర్లను 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం

మెట్రో ప్రయాణికులకు గుడ్​న్యూస్ : 3 ఆఫర్లను 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం
  • ఈ నెల 6 నుంచి నాగోలు, మియాపూర్​స్టేషన్లలో పెయిడ్​ పార్కింగ్ అమలు
  • నామ మాత్రపు ఫీజు వసూలు చేస్తామని వెల్లడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ సేవర్ 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ ఆఫర్లను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూడు ఆఫర్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి31 వరకు మూడింటిని పొడిగిస్తున్నట్లు ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్(మెట్రో రైల్​హైదరాబాద్ లిమిటెడ్) సోమవారం ప్రకటించాయి.

సూపర్ సేవర్ 59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్- పీక్ ఆఫర్ల డెడ్​లైన్ ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సేవర్ 59: సెలవు రోజుల్లో కేవలం రూ.59తో రోజంతా మెట్రోలో అపరిమితంగా జర్నీ చేయొచ్చు. ఇది ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్ లిస్టులో ఉన్న సెలవు రోజుల్లో అందుబాటులో ఉంటుంది. స్టూడెంట్ పాస్: ఈ ఆఫర్ ద్వారా స్టూడెంట్లు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు జర్నీ చేయొచ్చు. సూపర్ సేవర్ ఆఫ్ పీక్: రద్దీ లేని సమయాల్లో స్మార్ట్ కార్డు జర్నీపై 10% తగ్గింపు. ఉదయం 6 నుంచి 8, రాత్రి 8 తర్వాత ఈ ఆఫర్​అప్లయ్​ అవుతుంది.

పార్కింగ్​లో తాగునీరు, సీసీ కెమెరాలు

ఈ నెల 6 నుంచి నాగోలు, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్​ఫీజు వసూలు చేయనున్నట్లు ఎల్అండ్ టీ, ఎంఆర్ హెచ్ఎల్ ప్రకటించాయి. ప్రయాణికులకు పార్కింగ్ ఏరియాలో అధునాత సౌకర్యాలను కల్పిస్తామని తెలిపాయి. టూవీలర్స్, ఫోర్ వీలర్స్​కు స్లాట్లు కేటాయిస్తామని, బయో-టాయిలెట్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, లైటింగ్​ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాయి. యాప్​లేదా క్యూఆర్ కోడ్​ఆధారిత చెల్లింపు వ్యవస్థను తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి.

మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. దగ్గర్లోని పోలీస్, ఫైర్​స్టేషన్లు, హాస్పిటళ్ల వివరాలను డిస్​ప్లే చేస్తామని చెప్పాయి. ఇప్పటికే నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద పెయిడ్​పార్కింగ్​ అమలుచేస్తామని మెట్రో అధికారులు మూడు సార్లు ప్రకటించి వెనక్కి తగ్గారు. ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు. తాజాగా అక్టోబర్ 6 నుంచి నామమాత్రపు ఫీజు వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.