- టీచర్లకు రూ. 2లక్షలు.. ఆయాలకు లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్
- ‘అమ్మ మాట–అంగన్వాడీ బాట’
- కార్యక్రమంలో మంత్రి సీతక్క ప్రకటన
- చిన్నారులకు పచ్చదనంపై అవగాహన పెంచాలని సూచన
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ఇస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో జీవో విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహమాత్ నగర్ డివిజన్ లో ‘అమ్మ మాట– - అంగన్ వాడీ బాట’ కార్యక్రమానికి మంత్రి సీతక్క అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో మొక్కలు నాటించారు.
‘మై ప్లాంట్.. మై ఫ్యూచర్’ అని చిన్నారులతో పలికించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందిని నమ్మించి, మోసం చేసిందని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగానే అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నామని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమ్మ మాట–- అంగన్ వాడీ బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షర జ్ఞానంతోపాటు మానసిక ఉల్లాసం, పౌష్టికాహారం, ఆహ్లాదకర వాతావరణం, మంచి భద్రత లభిస్తుందని, కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అంగన్ వాడీ కేంద్రాలను తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్చించాలని తల్లి దండ్రులకు సీతక్క విజ్ఞప్తి చేశారు.
సాగు భూమి రిజిస్ట్రేషన్ చార్జీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ!
సాగు భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళా రైతులకు 50 శాతం రాయితీ ఇచ్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి సీతక్క స్పష్టం చేసారు. మహిళలను భూయజమానులుగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. మహిళా సాధికారత కోసం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. మహిళా రైతుల హక్కుల కోసం పనిచేసే ‘మహిళా కిసాన్ అధికార్ మంచ్’ (మకాం) ప్రతినిధులు ఉషా సీతామహాలక్ష్మి, రుక్మిణి రావు, ఆశాలత.. మంత్రిని ఆమె నివాసంలో కలిశారు.
పదెకరాల వరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో.. కుటుంబ సభ్యుల మధ్య భూ పంపకాలు జరిగే అవకాశాలున్నాయని ‘మకాం’ ప్రతినిధులు సీతక్క కు వివరించారు. పెళ్లికాని కుమార్తెలు, ఒంటరి మహిళలు, గృహిణుల పేర్లపై భూ రిజిస్ట్రేషన్ల ను పెంచేలా.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలో మహిళలకు రాయితీ ఇవ్వాలని, తద్వారా మహిళలకు ఆస్తి హక్కును అమలు చేసిన వారవుతారని అభిప్రాయపడ్డారు.