కేంద్ర ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని సర్కిల్స్లో బీఎస్ఎన్ఎల్ 4జీ ట్రయల్స్ పూర్తయ్యాయి. దీంతో.. వీలైనంత త్వరగా దేశంలోని అన్ని ప్రాంతాలకు 4జీ సేవలను విస్తరించాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. బీఎస్ఎన్ఎల్ సీనియర్ అధికారి సమాచారం ప్రకారం..4జీ ట్రయల్స్ ఆశాజనకంగా ఉండటంతో అక్టోబర్ 2024 నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. దేశంలో 25 వేలకు పైగా 4జీ టవర్స్ ఇప్పటిదాకా ఏర్పాటు చేశారు.
అంతేకాదు.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం 4జీ సిమ్ కార్డ్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వాస్తవానికి బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ సేవలను వేగవంతంగా అందించడంలో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోల్చితే వెనుకబడే ఉంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా(వీఐ) సూపర్ స్పీడ్తో 5జీ సేవలను అందిస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 4జీ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం కోసం నానా తంటాలు పడుతుండటం గమనార్హం.
బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ 2జీ, 3జీ ఇంటర్నెట్ సేవలను మాత్రమే సంతృప్తికర స్థాయిలో అందిస్తుందంటే రేసులో ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవచ్చు. డేటా సెంటర్స్ సెటప్ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల రూ.15 వేల కోట్లు బీఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్లో టీసీఎస్ ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. భారత్లోని 1000 మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడమే టీసీఎస్, బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్య ముఖ్య ఉద్దేశం. ఈ 1000 గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 4జీ ట్రయల్స్ నిర్వహించింది. ఈ పరిణామం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి.