కంటోన్మెంట్, వెలుగు: తాగునీటి కోసం నిత్యం సతమతమయ్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనాలకు కష్టాలు తీరనున్నాయి. అరకొర నీటి సరఫరాతో ఇబ్బందులు పడుతున్న సుమారు 4 లక్షల మందికి ఇక నుంచి రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేయనున్నారు. దీంతో 30 ఏండ్లుగా వారు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. కంటోన్మెంట్ వాసులకు రోజూ 55 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా అవుతుండగా.. ఆ నీటిని కంటోన్మెంట్ బోర్డు.. వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్ నుంచి కొనుగోలు చేసేది. ఇక నుంచి రోజుకు 81 లక్షల గ్యాలన్ల నీటిని కంటోన్మెంట్ బోర్డుకు సరఫరా చేసేందుకు వాటర్ బోర్డు అంగీకరించింది. ఈ మేరకు ఇటీవల కంటోన్మెంట్బోర్డు, హైదరాబాద్మెట్రో వాటర్వర్క్స్బోర్డుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్లు కంటోన్మెంట్అధికారులు వెల్లడించారు.
కొన్నేండ్లుగా సమస్య..
కంటోన్మెంట్ప్రజలు కొన్నేళ్లుగా తీవ్ర తాగు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం వస్తే ఆ కష్టాలు రెట్టింపయ్యేవి. కంటోన్మెంట్ చుట్టూ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతుండగా.. కంటోన్మెంట్కాలనీలకు మాత్రం వారానికి రెండు, లేదా మూడ్రోజులు మాత్రమే నీళ్లు వచ్చేవి. వారానికి ఒకేసారి మాత్రమే నీరు సరఫరా అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతినెలా నల్లా బిల్లులు కడుతున్నా మంచి నీరు మాత్రం సరిపడా ఇవ్వడం లేదని స్థానిక జనం ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అయితే రానున్న వేసవిలోనైనా ఈ నీటి కష్టాలను నివారించాలనే జనాల డిమాండ్లపై స్పందించిన కంటోన్మెంట్ బోర్డు.. రోజు విడిచి రోజు నీటిని అందించాలని నిర్ణయించి వాటర్బోర్డుతో ఒప్పందం చేసుకుంది.
రక్షణ శాఖ గ్రాంట్ ఎయిడ్ నిధులతో..
కంటోన్మెంట్ జనాల దాహార్తిని తీర్చేందుకు గాను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గ్రాంట్ఎయిడ్ నిధుల నుంచి హైదరాబాద్మెట్రో వాటర్వర్క్స్విభాగానికి రూ.10 కోట్లు కేటాయించినట్లు కంటోన్మెంట్ అధికారులు వెల్లడించారు. కుదిరిన ఒప్పందం ప్రకారం కంటోన్మెంట్లో సుమారు 30 వేల నల్లా కనెక్షన్లకు రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వల్ల ఈ వేసవిలో సుమారు 4 లక్షల మంది జనాల అవసరాలకు తగినట్లుగా నీరు అందించనున్నట్లు వెల్లడించారు.
ఫ్రీ వాటర్ స్కీమ్ నామ్ కే వాస్తే..
జీహెచ్ఎంసీ పరిధితో పాటు కంటోన్మెంట్ వాసులకు సైతం 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి సరఫరాను అందుబాటులోకి తీసుకొచ్చినా అది పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. ఉచిత మంచి నీటి స్కీమ్ పరిధిలోకి వచ్చేవారు తమ డాక్యుమెంట్లు సమర్పించి నల్లాలకు మీటర్లు బిగించుకోవాలని అధికారులు వెల్లడించి ఆ పనులు ఓ ప్రైవేటు కాంట్రాక్టర్కు అప్పగించగా.. అది నత్తనడకన సాగుతోంది. 40 శాతం మందికి మాత్రమే ఇప్పటివరకు మీటర్లు బిగించడంతో వారిలో కొందరు మాత్రమే ఈ స్కీమ్ ను పూర్తిస్థాయిలో పొందుతున్నారు. మిగతా 60 శాతం పనులు కూడా త్వరగా పూర్తిచేసి ఉచిత మంచి నీటి స్కీమ్ ను అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వేసవిలో ఇబ్బంది పడుతున్నం
కంటోన్మెంట్బోర్డు పరిధిలో గత కొన్నేండ్లుగా నీటి సరఫరా అస్తవ్యస్తంగా సాగుతోంది. ప్రతి నెలా నల్లా బిల్లులు కడుతున్నా నీటి సరఫరా మాత్రం అంతంత మాత్రమే. వేసవిలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొత్తగా కుదిరిన ఒప్పందంతోనైనా అధికారులు పకడ్బందీగా ప్లానింగ్ రూపొందించి రోజు విడిచి రోజు నీటిని ఇవ్వాలి.
- సతీష్గుప్తా, వాసవి నగర్సంక్షేమ సంఘం అధ్యక్షుడు