మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒకటి కాదు రెండు శుభవార్తలు

మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒకటి కాదు రెండు శుభవార్తలు

శ్రీశైలం/నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం ఒకటికి రెండు శుభవార్తలు చెప్పింది. టోల్ గేట్ ఎత్తివేతతో పాటు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ తెలిపింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థాన అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ప్రతి భక్తునికి స్వామి, అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను సూచించారు.

హోల్డింగ్ ఏరియా, పార్కింగ్ ప్రాంతాలు.. సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుంచి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు చేసి దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. 11 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ నందు భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయాలని దేవస్థాన అధికారులను మంత్రి ఆదేశించారు. పసిపిల్లలతో దర్శనానికి వచ్చే భక్తులకు పాలు, బిస్కెట్లు అందిస్తామని మంత్రి ఆనం తెలిపారు. ‘మహాశివరాత్రి’ పర్వదిన సమయాలలో 24, 25, 26,27.. ఈ నాలుగు రోజులలో క్యూలైన్లలో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని దేవస్థానం అధికారులను మంత్రి ఆదేశించారు.

ALSO READ | హైదరాబాద్ - విజయవాడ హైవే పై ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసు అధికారులకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీకి మంత్రి చెప్పారు. అటవీ చెక్‌పోస్టులను, దేవాదాయశాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెవెన్యూ,పోలీస్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుందని, ప్రముఖుల దర్శనాలకు టైంస్లాట్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.