- 2 నిమిషాలు వేడి చేసుకుని తినేయడమే
- 3 నుంచి 6 నెలలు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు
- ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషంలో వండుకుని తినేయొచ్చు
- పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న NRCM శాస్త్రవేత్తలు
- ఆసక్తి గల వ్యక్తులు,సంస్థలు ముందుకొస్తే శిక్షణ
హైదరాబాద్: హలీం పేరు వింటేనే చాలామందికి నోరూరుతుంది. అలాంటి టేస్టీ హలీం రుచి చూడాలంటే...రంజాన్ సీజన్ దాకా వెయిట్ చేయాల్సిందే. కానీ..ఇప్పుడు వెయిటింగ్ అక్కర్లేదంటోంది జాతీయ మాంసం అభివృద్ధి సంస్థ. నోరూరినప్పుడల్లా టక్కుమని నోట్లో వేసుకునేలా..మటన్ హలీమ్ బాల్స్ రూపొందించింది. తొందర్లోనే ఈ రెడీ టూ ఈట్ హలీమ్ బాల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి.
హైదరాబాద్ లో రంజాన్ పండుగ సీజన్ రాగానే హలీమ్, షీర్ ఖుర్మా గుర్తుకొస్తాయి. అయితే.. ఖుర్మా కావాలంటే ఎప్పుడైనా వండుకుని తినొచ్చు. హలీమ్ కావాలంటే రంజాన్ మాసం దాకా ఆగాలి. ఆ టైమ్ లోనే హలీమ్ కి గిరాకీ ఉంటుంది. రంజాన్ అయిపోగానే బట్టీలన్నీ మాయమవుతాయి. హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట 365 రోజులు హలీమ్ దొరుకుతున్నా.... వేరే ప్రాంతాల్లో వాళ్ళకి ఆ సౌకర్యం లేదు. అయితే జాతీయ మాంసం అభివృద్ధి సంస్థ లడ్డూల ఆకారంలో ఉండే మటన్ హలీమ్ బాల్స్ తయారు చేసింది. రుచిలో ఏమాత్రం తేడా లేకుండా నిల్వ చేసుకొని... ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేలా వీటిని తయారుచేశారు.
NRCM శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ ఏడాదిన్నర క్రితం మటన్ హలీమ్ బాల్స్ పై పరిశోధన మొదలుపెట్టారు. దాదాపు 30 మసాలాలతో కూడిన హలీమ్ స్పైస్ మిక్స్ ను ప్రత్యేకంగా తయారుచేశారు. 20 నుంచి 30 రకాల ఇంగ్రీడియంట్స్ తో వీటిని తయారు చేశారు. మూడు నుంచి ఆరు నెలలు పాటు హలీమ్ బాల్స్ ను డీఫ్రిజ్ లో నిల్వ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు తినొచ్చంటున్నారు డాక్టర్ సురేష్ . మటన్ హలీమ్ ను ఇంట్లోనే ఈ స్పైస్ మిక్సర్ ఉపయోగించి తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చంటున్నారు.
హలీమ్ తయారీకి 8 నుంచి 10 గంటల టైమ్ పడుతుంది. ఈ కొత్త రెసిపీతో 4 గంటల్లోనే ఇంట్లో హలీమ్ తయారు చేసుకోవచ్చు. హలీమ్ స్పైస్ మిక్స్ తో బాల్స్ రూపంలో తయారు చేయాలి. వాటిని నిల్వ ఉంచడానికి బియ్యపు పిండి...బఠాణీ, మైదా పిండి..మసాలాలు కలిపిన పిండి కోటింగ్ వేయాలి. ఈ కోటింగ్ తో హలీమ్ బాల్స్ ఆరు నెలల పాటు నిల్వ ఉన్నా...మాంసం పాడవ్వకుండా కాపాడుతుంది. వీటిని వేరే ప్రాంతాలకు తరలించవచ్చు.
హాలీమ్ బాల్స్ ను డీఫ్రిజ్ లో మైనస్ 18 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంచాలి. మూడు నుంచి ఆరు నెలల దాకా నిల్వ చేసుకోవచ్చు. తినే ముందు ఓ నిమిషం పాటు మైక్రో ఓవన్ లో థాయింగ్ చెయ్యాలి. తర్వాత 30 సెకండ్ల పాటు బాల్స్ వేడి చేసుకుని తినొచ్చు. మైక్రో ఓవన్ లేని వాళ్ళు ఫ్రిడ్జ్ నుంచి తీసిన బాల్స్ ను నిమిషం నుంచి నిమిషంన్నర పాటు పెనంపై ఐదారు చుక్కల ఆయిల్ వేసి ఫ్రై చేస్తే చాలంటున్నారు NRCM శాస్త్రవేత్తలు.
ఈ హలీమ్ మిక్సర్ తో ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. వెయ్యి రూపాయల ఖర్చుతో కేజీ ముడి పదార్థాలతో 25 గ్రాముల బరువున్న 30 నుంచి 40 బాల్స్ తయారు చేసుకోవచ్చు. దీనికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. అది రాగానే ఆ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసి... హలీమ్ బాల్స్ మార్కెట్లోకి తెస్తారు. ఆసక్తి గల వ్యక్తులు సంస్థలకు శిక్షణ కూడా ఇస్తామంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇవి కూడా చదవండి
టీకాలు తీసుకోని వారిలో కోవిడ్ ప్రభావం ఎక్కువ
బంగారు గని కూలి 38 మంది మృతి
అప్పులు కట్టేందుకు ఆర్టీసీ డిపోలు తాకట్టు