
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్ష రాసిన సుమారు పది లక్షల మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లను రీ వాల్యుయేషన్ చేయడం ఇబ్బందితో కూడుకున్న పని. దీంతో స్టూడెంట్లకు వచ్చిన మార్కుల్లో ఐదు స్లాట్లలో ర్యాండమ్ చెకింగ్ చేయాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా జీరో మార్కులు, 1 నుంచి పది మార్కులు, 25 నుంచి 35 మార్కులు, 60 నుంచి 70 మార్కులతో పాటు 95 మార్కుల నుంచి 99 మార్కులు వచ్చిన వారివి ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలోని 19 స్పాట్ కేంద్రాల్లో మంగళవారం రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మూడు రోజుల పాటు ఇది పూర్తికాగానే, మరో మూడు రోజులు ర్యాండమ్ ఆన్సర్ షీట్లను రీ వాల్యుయేషన్ చేయించనున్నారు.
వీటితో పాటు అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసై.. ఒక సబ్జెక్టులో ఫెయిలైతే ఆ సబ్జెక్ట్ ఆన్సర్ షీట్లను మరోసారి వాల్యుయేషన్ చేయనున్నారు. కాగా, రీ వాల్యుయేషన్ ప్రక్రియలో ఇంటర్ విద్యార్థికి ఒక సబ్జెక్టులో 33 మార్కులు రాగా.. రీ వాల్యుయేషన్ లో 36 మార్కులు వచ్చినట్టు ఓ క్యాంప్ ఆఫీసర్ తెలిపారు. అయితే, ప్రైవేటు కాలేజీ లెక్చరర్ ఈ పేపర్ వాల్యుయేషన్ చేసినట్టు గుర్తించినట్టు చెప్పారు. అయితే, రీ వాల్యుయేషన్ నిర్ణయంతో కొందరు విద్యార్థుల మార్కుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 25 వరకు ఫలితాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
తప్పుల నివారణకే: జయప్రద బాయి, ఇంటర్ బోర్డు సీఓఈ
వాల్యుయేషన్ ప్రక్రియలో జరిగే తప్పుల నివారణకే రీ వాల్యుయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నం. విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇంటర్ బోర్డు సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు స్లాట్లలో ర్యాండమ్ గా ఎంపిక చేసిన ఆన్సర్ షీట్లను రీ వాల్యుయేషన్ చేస్తున్నం. ఒకే సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులవి ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేయిస్తున్నం. విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నం.