- రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల్లో ఆనందం
- గత ప్రభుత్వంలో 10 శాతం మాత్రమే సబ్సిడీ
- తాజాగా 25 శాతానికి పెంచుతూ నిర్ణయం
- మొత్తంగా1600 మందికి చేకూరనున్న లబ్ధి
- ఇప్పటికే రూ. 150 కోట్ల బకాయిలు చెల్లింపు
- కాంగ్రెస్ సర్కార్ చర్యలతో నేతన్నలకు భారీ ఊరట
రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల నేతన్నల సమస్యలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ భారీ ఊరటను కలిగిస్తుంది. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వెన్ను దన్నుగా నిలిచింది.
తాగాజా పవర్ లూమ్స్ కు విద్యుత్ సబ్సిడీని 25 శాతానికి పెంచింది. సిరిసిల్లలో మొత్తం 25 వేల పవర్ లూమ్స్ ఉండగా.. 21,500 పవర్ లూమ్స్ కు లబ్ధి చేకూరనుంది. దాదాపు1600 మంది నేతన్నలు లబ్ధి పొందుతారు. గత సర్కార్10 హెచ్ పీ వరకు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా పవర్ లూమ్స్ కేటగిరి–3 కిందివారే లబ్ధి పొందారు. ప్రస్తుత సర్కార్ సబ్సిడీని 25 శాతానికి పెంచడంతో చాలా మంది నేతన్నలు కేటగిరి–4(కుటీర పరిశ్రమల కిందికి) మారుతారు. ఇక టెస్కో అధికారులు నేతన్నల లెక్కలు తీస్తున్నారు.
ఈఆర్ సీ అభిప్రాయ సేకరణ
పది రోజుల కింద విద్యుత్ నియంత్రణ మండలి సిరిసిల్ల సెస్ పరిధిలో విద్యుత్ టారిఫ్ లపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. పవర్ లూమ్స్ కు 30 శాతం విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలనే డిమాండ్ ను నేతన్నల నుంచి వ్యక్తమైంది.
దీనిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి కూడా లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుంచి ఆదుకునేందుకు 25 శాతానికి విద్యుత్ సబ్సిడీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నేతన్నల్లో ఆనందం
ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ 10 శాతం నుంచి 25 శాతానికి పెంచడంతో సిరిసిల్ల నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ పెంపు ద్వారా తమకు ఉపాధి కూడా పెరుగుతుందని పేర్కొంటున్నారు. ప్రైవేటు ఆర్డర్లలోనూ ఉత్పత్తి చేసుకుంటామంటున్నారు. గత సర్కార్ బతుకమ్మ చీరల బకాయిలు రూ. 150 కోట్లను పెండింగ్ పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విడుదల చేసింది. ఆర్వీఎం, సంక్షేమ హాస్టల్స్ యూనిఫామ్ ఆర్డర్ ఇచ్చింది. ఇలా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుండగా.. సిరిసిల్ల నేతన్నలకు పెద్దఎత్తున ఊరట కలుగుతుంది.
సర్కార్కు రుణపడి ఉంటాం
పవర్ లూమ్స్ కు విద్యుత్ సబ్సిడీ పెంచడంతో చిన్న ఆసాములు సైతం ప్రైవేటు ఆర్డర్ లోనూ పని దొరుకుతుంది. దీంతో వస్త్ర ఉత్పత్తి చేసుకుంటూ సొంతంగా మార్కెట్ చేసుకుని ఉపాధి పొందుతారు. విద్యుత్ బిల్లుల రాయితీతో ఊరట లభిస్తుంది. సర్కార్ కు రుణపడి ఉంటాం.
- ఆడేపు భాస్కర్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు