రాజన్నసిరిసిల్ల, వెలుగు: మిడ్‌మానేరు (శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్) నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిడ్ మానేరు డ్యాంలో సర్వం కోల్పోయిన వారు ఇల్లు నిర్మించుకోవడం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఎనిమిదేండ్లు ఎదురుచూస్తున్న నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
12 గ్రామాల్లో 10,600 మంది నిర్వాసితులు
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం మనువాడ వద్ద మిడ్ మానేరు ప్రాజెక్ట్‌ను నిర్మించారు. 2.32 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో 25.6 టీఎంసీల కెపాసిటీతో ప్రాజెక్ట్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 2006లో ప్రారంభమైన పనులు 2019లో పూర్తయ్యాయి. ప్రాజెక్ట్‌లో కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, షభాశ్‌పల్లి, అనుపురం, రుద్రవరం, కొడిముంజ, చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రవాణిపల్లె, ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 12 గ్రామాలకు చెందిన 10,600 కుటుంబాలకు పరిహారం చెల్లించారు. అలాగే నిర్వాసితులందరికీ 242 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని ఇచ్చారు. వారు ఆ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నారు.
ఎనిమిదేండ్లుగా ఎదురుచూపులు
వేములవాడ రాజన్న ఆలయాన్ని 2015లో అప్పటి సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ టైంలో మిడ్ మానేరు నిర్వాసితులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5.04 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్క ఇంటి నిర్మాణానికి రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ముంపు గ్రామాలకు చెందిన ప్రజలు పోరుబాట పట్టారు. ఎనిమిదేండ్లుగా పోరాటం చేసినా అప్పటి ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. 2019 ఆగస్ట్ 30న ముంపు గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టగా, ఆ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరై నిర్వాసితులకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముంపు భాదితులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
మొదటి విడతలో 4,696 ఫ్యామిలీలకు...
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీని ప్రకారం డబ్బులు మంజూరు చేశారు. మొత్తం 10,600 ఫ్యామిలీలు ఉండగా మొదటి విడతలో 4,696 మందికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున ప్రకటించారు. మిగతా వారికి రెండో విడతలో రూ. 5 లక్షలు మంజూరు అవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు.
ఆనందంలో మిడ్‌మానేరు నిర్వాసితులు
ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు మంజూరు చేయడం పట్ల మిడ్‌మానేరు నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేండ్ల పోరాటానికి ఫలితం దక్కిందని, తమ ఎదురుచూపులకు తెరపడిందని ఆనంద పడుతున్నారు. ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోయామని, ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరామని, ఎనిదేండ్ల నుంచి నిరసనలు, ధర్నాలు, రీలే దీక్షలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చారని అంటున్నారు.
సీఎంకు రుణపడి ఉంటాం
సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. మేం ఎనిమదేండ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ మెట్ల మీద నుంచి నిర్వాసిత కుటుంబానికి రూ. 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. రేవంత్‌రెడ్డి డబ్బులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది.
కూస రవీందర్, ముంపు గ్రామాల ఐక్యవేదిక అధ్యక్షుడు