హైదరాబాద్: రైళ్లలో జనరల్ బోగీల పెంపుపై రైల్వే కేంద్ర సహయ మంత్రి రన్విత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైళ్లలో దశల వారీగా జనరల్ బోగీలు పెంచుతామని.. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న స్టేషన్ అభివృద్ది పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కలిసి రన్విత్ సింగ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 700 కోట్లతో సికింద్రబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపడుతున్నామని, 2026 కల్లా పనులు మొత్తం పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు 27 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు.
చర్లపల్లి స్టేషన్ పనులు శరవేగంగా కంప్లీట్ అయ్యాయని.. త్వరలోనే ఆ స్టేషన్ను ప్రారంభిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నామని, నీటి సదుపాయం పెంచేందుకు పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్టులు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు అభివృద్ధి కూడా జరుగుతోందన్నారు. ప్రధాని మోడీ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 119 రైల్వే స్టేషన్లను రూ.5000 కోట్లతో అభివృద్ధి చేయాలని సూచించారని.. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ది చేస్తున్నామన్నారు.