- ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో నగదు బదిలీ ట్రయల్స్
అమరావతి: రేషన్ కార్డు దారులకు నిజంగా శుభవార్తే. రేషన్ కార్డుదారులు ఇకపై అవసరమైతే బియ్యం తీసుకోవచ్చు. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు తీసుకోవచ్చు. నగదు బదిలీ కార్యక్రమం అమలు దిశగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు చేశారు. లోటుపాట్లను సవరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
బియ్యం వద్దనుకునే కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు బదిలీ చేస్తారు. తొలుత కాకినాడ, అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల తదితర ప్రాంతాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. కిలోకు రూ.12 నుంచి రూ.15 మధ్య ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డబ్బులు కావాలనుకునే వారు వరుసగా రెండు నెలలు నగదు తీసుకున్నా.. ఆ తర్వాతి నెలలో బియ్యం కావాలంటే బియ్యం తీసుకోవచ్చు. ఈ విధానాన్ని పరిశీలించి సంతృప్తికరమైన ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నారు.
బియ్యం అమ్ముకుంటున్నారనే నగదు బదిలీ
రేషన్ దుకాణాల్లో తీసుకున్న సబ్సిడీ బియ్యాన్ని చాలా మంది వాడడం లేదు. అన్నం వండుకుని తింటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒకవేళ వాడినా దోశెలు, ఇడ్లీలు, పొంగనలు వంటి వాటికి రేషన్ బియ్యం వాడుకుంటున్నారు. వీటి కోసం రేషన్ దుకాణాల్లో తీసుకుంటున్న బియ్యంలో మూడో వంతుసరిపోతున్నాయి. మిగిలిన బియ్యాన్ని ఇల్లిళ్లూ తిరిగి కొంటుున్న వారికి అమ్మేస్తున్నారు. ఇల్ల వద్దకే వెళ్లి కొన్న వారు స్థానిక అవసరాలకు వాడడమో లేదా మళ్లీ పాలిష్ చేస్తూ సన్నబియ్యం పేరుతో అమ్మడమో లేక.. హోటళ్లకు అమ్ముకోవడం జరుగుతోంది.
అంటే రేషన్ కార్డు దారులు ఒక నెల బియ్యం వాడుకుంటే.. మిగిలిన రెండు నెలల బియ్యం తిరిగి అమ్మేస్తున్న విషయం బహిరంగ రహస్యం. ఈ తతంగాన్ని గమనించిన పౌరసరఫరాల శాఖ.. బియ్యం వృధాగా చేతులు మారే బదులు నగదు బదిలీ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనపై దృష్టి సారించారు. ప్రయోగాత్మకంగా అమలు చేసి లోటుపాట్లను సవరించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్
జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్ క్యాన్సర్!
ఎక్కువ కాల్షియాన్ని అందించే ఫుడ్స్ ఇవే..