సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలకు గుడ్ న్యూస్

సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలకు గుడ్ న్యూస్
  • సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాలకు గుడ్ న్యూస్
  • వారసత్వ ఉద్యోగాల ఏజ్‌ లిమిట్‌ను పెంచుతూ సర్క్యులర్‌ జారీ
  • 40 ఏండ్ల లోపు ఉన్న కార్మికుల వారసులకు దక్కనున్న ఉద్యోగాలు
  • సింగరేణి పరిధిలో 500 మందికి పైగా ప్రయోజనం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతూ ఆ సంస్థ ఆర్డర్స్‌ జారీ చేసింది. కరోనా టైంలో రెండేండ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వయోపరిమితిని 35 నుంచి 40 ఏండ్లకు పెంచుతూ సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ సింగరేణి ఆఫీసర్లు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ బుధవారం సర్క్యులర్‌ విడుదల చేశారు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా వందలాది మంది కారుణ్య నియామకాల్లో భాగంగా జాబ్‌లో చేరనున్నారు. 

2018 నుంచి ఎదురుచూపులు

సింగరేణిలో 2018 ఏప్రిల్‌ నుంచి వారసత్వ ఉద్యోగాల విధానం అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంస్థలో పనిచేస్తూ కార్మికుడైనా, ఉద్యోగి అయినా చనిపోతే అతడి వారసుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. అలాగే అనారోగ్య కారణాల రీత్యా మెడికల్‌ బోర్డు అన్‌ఫిట్‌గా ప్రకటించిన కార్మికుల వారసులను కూడా ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అయితే ఇలాంటి ఉద్యోగాలకు ఏజ్‌ లిమిట్‌ 35 ఏండ్లుగా నిర్ణయించారు. 2018 ఏప్రిల్‌ నుంచి మెడికల్‌ ఇన్‌ వాలిడేషన్‌ అయిన కార్మికుల వారసుల్లో చాలా మంది 36 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండడంతో వారంతా వారసత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు.

 దీనికి తోడు కరోనా సమయంలో రెండేండ్ల పాటు మెడికల్‌ బోర్డు నిర్వహించకపోవడం వల్ల మరికొందరి వయోపరిమితి దాటిపోయింది. వీరికి సింగరేణి యాజమాన్యం ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో చాలా మంది ఉద్యోగానికి బదులు ఏకమొత్తం కింద రూ.25 లక్షలు తీసుకున్నారు. కొంత మంది తమ కుమారులను కాకుండా ఇతర కుటుంబ సభ్యులను ఉద్యోగాల్లో పెట్టించారు. కేవలం ఒకే ఒక వారసుడు ఉన్న కార్మికులు మాత్రం ఎదురుచూస్తూ ఉన్నారు.

హామీ ఇచ్చి పట్టించుకోని గత సర్కార్‌

కారుణ్య నియామకాల్లో 35 ఏండ్లు దాటిన వారికి కూడా అవకాశం కల్పించాలని కార్మిక సంఘాల లీడర్లు పలుమార్లు యాజమాన్యంతో చర్చించారు. వారసత్వ ఉద్యోగాల వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచాలని అప్పటి చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సైతంలో అసెంబ్లీలో కోరారు. దీనిపై అప్పటి సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా తర్వాత పట్టించుకోలేదు. దీంతో కార్మికుల కుటుంబాలు ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూశాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వస్తే వారసత్వ ఉద్యోగాల ఏజ్‌ లిమిట్‌ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల టైంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

 తర్వాత 2024 ఫిబ్రవరి7న హైదరాబాద్‌లో నిర్వహించిన వారసత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేత కార్యక్రమంలో సైతం పలువురు వయోపరిమితి పెంపు విషయాన్ని ప్రస్తావించారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి వారసుల వయోపరిమితి 40 ఏండ్లకు పెంచుతామని ప్రకటించారు. సీఎం ఆదేశాలతో సింగరేణి బోర్డ్‌ ఆఫ్​ డైరెక్టర్లు సమావేశమై వయోపరిమితిని 40 ఏండ్లకు పెంచుతూ నిర్ణయించి, ఈ పెంపును 2018 మార్చి 9 నుంచి అమలు చేస్తామని గతేడాది జూన్‌ 11న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఎట్టకేలకు అమల్లోకి రావడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

500 మంది వారసులకు ఉద్యోగాలు

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల వయోపరిమితిని పెంచుతూ ఆర్డర్స్‌ జారీ చేయడంతో సుమారు 500 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. 2018 మార్చి 9 నుంచి 2024 జూన్‌ 9 వరకు పెండింగ్‌లో ఉన్న 35 ఏండ్ల నుంచి 40 ఏండ్ల లోపు ఉన్న డిపెండెంట్లకు కొత్త సర్క్యులర్​ ద్వారా ఉద్యోగాలు లభించనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారికి వెంటనే ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ పెంపు వారసత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తించనుండగా, నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసే సాధారణ ఉద్యోగాలకు ఎప్పటిలాగే ఏజ్‌ లిమిట్​ 30 ఏండ్లే ఉండనుంది.