ఎకరాకు రూ.20 లక్షలు! ఎన్​హెచ్​163 భూసేకరణ పరిహారం పెంపు

ఎకరాకు రూ.20 లక్షలు! ఎన్​హెచ్​163 భూసేకరణ పరిహారం పెంపు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల, వరంగల్​ గ్రీన్​ఫీల్డ్​ హైవే 163జీ నిర్వాసితులకు గుడ్​న్యూస్. హైవే కోసం సేకరిస్తున్న భూములకు మార్కెట్​రేట్లకు అనుగుణంగా పరిహారం అందనుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం పొందిన వారికి ఆ తర్వాత ఆర్బిట్రేషన్​ ద్వారా ఎకరానికి రూ.20 లక్షలకు పైగా చెల్లించనున్నట్టు కలెక్టర్​కుమార్​దీపక్​హామీ ఇచ్చారు. ఎన్​హెచ్​ 63లో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న గ్రీన్​ఫీల్డ్​హైవే భూసేకరణకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. దీంతో హైవేల కోసం భూములు కోల్పోతున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

300 ఎకరాలు సేకరణ

నేషనల్​హైవే 163జీ మంచిర్యాల నుంచి వరంగల్​వరకు నిర్మించనున్నారు. ఇది జిల్లాలో 23 కిలోమీటర్లు సాగుతుంది. దీనికోసం జైపూర్​ మండలంలోని ముదిగుంట, నర్వ, ఇందారం, టేకుమట్ల, ఎల్కంటి, నర్సింగాపూర్, శెట్ పల్లి, బెజ్జాల, కుందారం, రొమ్మపూర్, కిష్టాపూర్, వేలాల, మద్దులపల్లి, గోపాల్​పూర్​గ్రామాల్లో 300 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల లోపే పరిహారం వస్తోంది. ఈ గ్రామాల్లో మార్కెట్​రేటు రూ.20 లక్షలకు పైనే ఉంది. దీంతో రైతులు పరిహారం పెంచాలని, ఎకరాకు రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. పలుమార్లు సర్వే పనులను అడ్డుకోవడమే కాకుండా కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. 

స్పందించిన ప్రభుత్వం 

రైతుల నిరసనలతో ప్రభుత్వం స్పందించింది. చెన్నూర్​ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి సైతం భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు గ్రీన్​ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచేందుకు కలెక్టర్​ కుమార్​దీపక్​అంగీకరించారు. ముందుగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మంజూరైన పరిహారాన్ని రైతులు తీసుకోవాలి. తర్వాత ఆర్బిట్రేషన్ కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి మెరుగైన పరిహారం చెల్లించనున్నారు. గవర్నమెంట్​రేటులో మార్పు చేయడం, నోటిఫికేషన్​ రిలీజ్ చేసినప్పటి నుంచి 9 పర్సెంట్​ఇంట్రెస్ట్​కలుపుకొని ఎకరానికి రూ.20 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు చెల్లించనున్నారు. సంబంధిత పత్రాలను మంగళవారం కొందరు రైతులకు అందజేశారు. 

ఎన్​హెచ్​63 భూములకు సైతం 

ఎన్​హెచ్ 63లో భాగంగా ఆర్మూర్​ నుంచి మంచిర్యాల వరకు నిర్మించనున్న గ్రీన్​ఫీల్డ్​హైవే భూసేకరణలో సైతం ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలో 33 కిలోమీటర్లు సాగనున్న ఈ రోడ్డు కింద జిల్లాలోని 17 గ్రామాల్లో 1420 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్​జారీ చేశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు మరోసారి గ్రీన్​ఫీల్డ్​హైవేలో కోల్పోతున్నారు. దీంతో వీరు ఎన్​హెచ్​కు భూములు ఇవ్వబోమంటూ నోటీసులను తిరస్కరించారు. తప్పనిసరిగా సేకరించాల్సి వస్తే రూ.30 లక్షలకు పైగా చెల్లించాలని డిమాండ్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​హెచ్​63 భూములకు సైతం ఆర్బిట్రేషన్​ ద్వారా మెరుగైన పరిహారం అందించనున్నారు. 

హైవేస్​నిర్మాణానికి సహకరించాలి

ఎన్​హెచ్​ 163జీలో భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నాం. తర్వాత ఆర్బిట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.20 లక్షల వరకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చెట్లు, బోర్లు, పైపులు, ఇతర  నష్టపోయిన వారు ఆలస్యం చేయకుండా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణానికి అందరూ సహకరించాలి.- కుమార్​ దీపక్​, మంచిర్యాల కలెక్టర్​