కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలకు నేరుగా వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో శ్రీవారి భక్తులు ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్ టికెట్లను ఎప్పుడు విడుదల చేస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల బుకింగ్ తేదీలను టీటీడీ వెల్లడించింది. ఈ నెల 28న (శుక్రవారం) ఫిబ్రవరి మొత్తానికి సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ తమ వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు టికెట్లు బుకింగ్‌కు అందుబాటులోకి వస్తాయి. రోజుకు 12 వేల చొప్పున టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
29న సర్వ దర్శనం టికెట్లు
కొద్ది నెలలుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు టీటీడీ సర్వ దర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తోంది. ఈ నెల 29న (శనివారం) ఉదయం 9 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం (ఉచిత) టికెట్లను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని టీటీడీ వెల్లడించింది. ఈ సర్వ దర్శనం టికెట్లను రోజుకు 10 వేల చొప్పున కేటాయించినట్లు పేర్కొంది. తిరుమలకు వచ్చే భక్తులు కరోనా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. దర్శనానికి వచ్చేటప్పడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉండాలని తెలిపింది.