పసుపు రైతులకు గుడ్ న్యూస్: నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ వేళ పసుపు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించింది. 2025, జనవరి 14వ తేదీన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి, కేంద్రమంత్రి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దేశ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

నిజామాబాద్‎లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి బండి సంజయ్ కోరికను సంక్రాంతి పండుగ రోజున తీర్చామన్నారు. దేశంలోని 20 రాష్ట్రాల పసుపు రైతులకు ప్రధాని మోడీ పండుగ కానుక ఇచ్చారని అన్నారు. ప్రధాని మోడీ ఏదైనా హామీ ఇస్తే కచ్చితంగా నేరవేర్చుతారని.. అందుకే ఇదే సాక్ష్యమని పేర్కొన్నారు. పసుపు రైతులకు బోర్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు అర్వింద్, బండి సంజయ్ చాలా కృషి చేశారని పేర్కొన్నారు. పసుపు రైతులకు అన్ని విధాలా బోర్డు మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ALSO READ | పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్: కేంద్రమంత్రి బండి సంజయ్

కాగా, నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటుకు 2025, జనవరి 13న కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 2025, జనవరి 14న నిజామాబాద్‎లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు. అలాగే.. నిజామాబాద్‎కు చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్‎గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.