బీహెచ్ఈఎల్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి కొత్తగా ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ వెళ్లేందుకు కొత్తగా రెండు ఈ-గరుడ బస్సులను 30వ తేదీ నుంచి నడపనున్నారు. ఈ విషయాన్ని రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత మీడియాకు తెలిపారు. ఈ రెండు ఈ-గరుడ బస్సులు రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ, రైతు బజార్,మలేషియన్ టౌన్ షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్ ,మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాం నగర్ మీదుగా ఓఆర్ఆర్ నుంచి విజయవాడకు వెళతాయి.
దీని వల్ల విజయవాడ వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రతిరోజూ రాత్రి 09:30కి ఒక బస్సు, రాత్రి 10:30 కి మరో బస్సు రామచంద్రాపురం నుంచి బయలుదేరనున్నాయి. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఈ రెండు బస్సులకు సంబంధించి టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
విజయవాడకు ఇప్పటికే బీహెచ్ఈఎల్ వైపు నుంచి పలు బస్సులు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీటిలో చాలా వరకూ కూకట్పల్లి, అమీర్పేట్ మీదుగా వెళుతుంటాయి. ఆంధ్రా వైపు వెళ్లే బస్సులు ఎక్కువగా ఇదే రూట్లో వెళుతుంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో ఈ రూట్ రాత్రుళ్లు బిజీబిజీగా మారుతుంది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటే ఆ యాతన వర్ణించలేనిది. అందుకే.. సిటీ దాటేందుకు ఓఆర్ఆర్ మీదుగా కొత్తగా ఈ రెండు ఈ-గరుడ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.