- అధికారులతో కూడినఇందిరమ్మ కమిటీల లిస్టే ఫైనల్
- రాజకీయ జోక్యం లేకుండా.. పేదలకే ఫస్ట్ ప్రయారిటీ
- నాలుగు విడతల్లో రూ.5 లక్షలు బ్యాంకు ఖాతాల్లో వేస్తం
- సీఎంగా మరో నాలుగేండ్లు రేవంత్‌రెడ్డే ఉంటరు
- ఆ తరువాత ఐదేండ్లు ఎవరనేది ఏఐసీసీ నిర్ణయిస్తది
- సంక్రాంతి వరకు గ్రామాల్లో కొత్త సర్పంచులు వస్తరని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 20వ తేదీ వరకు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను రెడీ చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 6వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మొదలుపెడతామని చెప్పారు. అధికారులతో కూడిన ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేస్తాయన్నారు. ఇంటి నిర్మాణానికి నాలుగు విడతల్లో రూ.5 లక్షల నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. తల తాకట్టు పెట్టి అయినా గ్రీన్‌చానెల్‌లో ఇందిరమ్మ ఇండ్లకు ఫండ్స్ మంజూరు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు రేషన్ కార్డు తప్పనిసరి కాదని.. త్వరలో రానున్న స్మార్ట్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇంకో 4 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డినే ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. శనివారం సెక్రటేరియెట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఇందిరమ్మ ఇండ్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. గత ప్రభుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించినట్టు మంత్రి తెలిపారు. మొదటి విడతలో ఇండ్ల స్థలాలు ఉన్న పేదలకు ప్రాధాన్యం ఇస్తామని, ఆ తరువాత స్థలాలు లేని పేదల కోసం ప్రభుత్వ స్థలాలను కేటాయించడం, అవసరమైతే ప్రభుత్వమే కొన్నిచోట్ల స్థలాలను కొనుగోలు చేసి వారి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని సమకూర్చి ఇండ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.
నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు..
ఇండ్ల నిర్మాణంపై కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో రాబోయే నాలుగేండ్లలో తాము 20 లక్షల ఇండ్ల నిర్మాణం టార్గెట్‌గా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులు ఆశిస్తున్నామని, లేకపోతే తామే ఇండ్లు కట్టిస్తామన్నారు. తొలి విడతలో సుమారు రూ.28 వేల కోట్ల వరకు ఖర్చు అవుతాయన్నారు. ఈ బడ్జెట్లో సుమారు 7,740 కోట్లు ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందన్నారు. అవసరాల మేర లోన్లు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన దాదాపు 600–-800 గృహజ్యోతి ఇండ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో (ఫౌండేషన్) రూ.లక్ష, బేస్మెంట్, ఫిల్లర్స్ లెవల్లో రూ.1.25 లక్షలు, స్లాబ్ లెవల్లో రూ.1.75 లక్షలు, ఇతర నిర్మాణాలు పూర్తవుతుంటే రూ.లక్ష ఇస్తామన్నారు. లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.
ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి మాట్లాడాలిగా..
‘ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి మాట్లాడాలి.. లేపోతే అది ప్రతిపక్షం ఎలా అవుతుంది?’ అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగేండ్ల ఒక నెల పీరియడ్ ఉందని, అప్పటి వరకు సీఎంగా రేవంత్ రెడ్డినే కొనసాగుతారన్నారు. కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు. కొన్ని రోజుల్లోనే ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు’’అని మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రం నుంచి నిధులు వస్తే ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తామన్నారు. రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిని కూడా ఆహ్వానిస్తామని.. డెవలప్మెంట్ విషయంలో రాజకీయాలు చూడమని మంత్రి తెలిపారు. పేద ప్రజలకు అన్యాయం జరగొద్దని కేంద్రం ఎన్ని కండిషన్‌లు పెట్టినా ఒప్పుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లపై కేంద్రం లోగో పెట్టుకోవడానికి కూడా ఒప్పుకున్నామన్నారు. డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలోగా సర్పంచ్ ఎన్నికలు పూర్తవుతాయని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి వరకు కొత్త సర్పంచ్‌లు కొలువుదీరుతారని తెలిపారు. ఈ నెలలో జరిగే గ్రామ సభల్లో సర్పంచ్‌లు ఉండరని, ఆ తరువాత జరిగే సభల్లో ఉంటారని మంత్రి వెల్లడించారు.
ప్రత్యేక యాప్‌తో అన్ని వివరాలు చెక్ చేస్తం..
లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్‌తో అన్ని వివరాలు చెక్ చేస్తామని మంత్రి తెలిపారు. ఆధార్‌తో సహా అన్ని డిటేయిల్స్ యాప్‌లో పొందుపరుస్తామన్నారు. ఇండ్ల నిర్మాణంపై 4 రాష్ట్రాలలో స్టడీ చేసినట్టు చెప్పారు. ఇంటి నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవని, లబ్ధిదారుల ఇష్టం మేరకు ఇండ్లు నిర్మించుకోవచ్చన్నారు. అయితే, కనీసం 400 చదరపు అడుగులు (స్క్వేర్ ఫీట్స్) తగ్గకుండా నిర్మించుకోవాలని సూచించారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్టు తెలిపారు. వాటి నిర్మాణానికి ఇసుకను ఫ్రీగా ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. స్టీల్, సిమెంట్ సైతం తక్కువ మొత్తానికి అందించేందుకు ఆయా కంపెనీలతో మాట్లాడుతామన్నారు. ప్రతి మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఏఈలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 16 శాఖలకు చెందిన వారిని సమీకరించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఒకే గొడుగు కింద ఇంజినీర్ల పర్యవేక్షణలో ఇండ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నందనవనం, మంకాల్ ఇండ్ల సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తమని మంత్రి పేర్కొన్నారు.