వెలుగు:రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్‌కు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.
విడతల వారీగా జమ..
రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకున్నది. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర సేకరించింది. ఇందులో రైతు భరోసాకు అవసరమైన రూ.8,900 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగే విడతల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనుంది. ఎకరాకు రూ.6 వేల చొప్పున కోటి 49 లక్షల ఎకరాలకు ఇస్తే రూ.8,900 కోట్లు అవుతున్నది. గతంతో పోలిస్తే ఇది దాదాపు రూ.1,500 కోట్లు ఎక్కువ. ఏయే గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల డిజిటల్బ్లాకింగ్పూర్తయిందో, ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూములున్న రైతులకు ఈ నెల 26న పెట్టుబడి సాయం అందనుంది.
Also Read :- కాగితపు పులులను తయారు చేస్తున్న విద్యావిధానం
ఇలా విడతల వారీగా పూర్తి స్థాయిలో నిధులను 15 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే టీజీబీలో ఏపీజీవీబీ విలీనం నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తే టెక్నికల్సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఒకవేళ ఈ నెల 25 కల్లా ఆ బ్యాంకు నుంచి క్లారిటీ వస్తే ఆ మరుసటి రోజు యథావిధిగా నిధులు జమ చేస్తామని, లేదంటే ఆ ఖాతాదారులకు తర్వాత జమ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి, ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నారు.