హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. రెండు రోజుల ముందే జీతాలు విడుదల చేసింది. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు రూ.120 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు. గతంలో 5వ తేదీ వరకు జీతాల కోసం జీహెచ్ఎంసీ ఉద్యోగులు ఎదురుచూడాల్సి వచ్చేది.
ఇదిలా ఉండగా.. జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఫేషియల్ అటెండెన్సీ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంస్థలోని మొత్తం 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ ద్వారా క్యాప్చర్ చేయడం ద్వారా అటెండెన్స్ నమోదు అవుతుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది.
Also Read :- కుల గణన సర్వేకు అంతా సహకరించాలి
జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 39 విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరును ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఇంతకు ముందు కార్పొరేషన్ పరిధిలో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ హ్యాండ్ హెల్డ్ డివైజ్తో అటెండెన్స్ నమోదు చేసేవారు.
ఈ సిస్టమ్ తో పారిశుధ్య కార్మికులు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తొలగించారు. ఆ తర్వాత నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని శానిటరీ వర్కర్స్ కు ఫేషియల్ రికగ్నీషన్ అటెండెన్స్ ను అమలు చేస్తున్నారు. ఈ విధానంతో పారదర్శకంగా , కచ్చితత్వంతో కూడిన అటెండెన్స్ నమోదు అవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.