- అమెరికాలో గ్రీన్ కార్డు జారీలో దేశాల కోటా తొలగింపు బిల్లు పై బైడెన్ సంతకం
- కాంగ్రెస్ ఆమోదం తర్వాత.. లిమిట్ ఎత్తివేసే చాన్స్
- అక్రమ ఇమిగ్రెంట్లకు సిటిజన్‌షిప్ ఇచ్చేందుకూ అవకాశం
వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఇమిగ్రెంట్ల (అమెరికా వలస వచ్చిన వారు) కష్టాలపై ఫోకస్ పెట్టారు. ట్రంప్ పాలనలో ఇమిగ్రెంట్ల విషయంలో అనుసరించిన కఠిన నిర్ణయాలను మార్చేందుకు కీలక బిల్లును ఆయన బుధవారం కాంగ్రెస్‌కు పంపారు. అమెరికాలో ఎంతో శ్రమపడుతూ దేశ ఎకానమీ వృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఉద్యోగినీ కాపాడేందుకే ఈ బిల్లును బైడెన్ తెచ్చారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మీడియాకు వెల్లడించారు. ‘యూఎస్ సిటిజన్‌షిప్ యాక్ట్ ఆఫ్2021’ పేరుతో ప్రతిపాదించిన ఈ బిల్లు పాస్ అయితే హెచ్1బీ వీసాలపై దేశాల ‘కోటా’ను ఎత్తేసే అవకాశం ఉంది. దీంతో ఇండియన్ ఐటీ ఉద్యోగులకూ భారీ ఊరట లభించనుంది. ప్రస్తుతం ఇండియా నుంచి హెచ్1బీ వీసా హోల్డర్లకు గ్రీన్ కార్డులు లేదా పర్మనెంట్ లీగల్ రెసిడెన్సీ పొందేందుకు 7% కోటా అమలవుతోంది. దీనివల్ల గ్రీన్ కార్డుల కోసం ఇప్పుడు దశాబ్దాల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది. కొత్త బిల్లుతో ఇండియన్ టెకీలకు ఈ వెయిటింగ్ భారీగా తగ్గనుంది. హెచ్1బీ వీసా హోల్డర్ల భార్య / భర్తకు వర్క్ పర్మిట్ కూడా లభించనుంది. ఈ బిల్లు అమెరికాను ఇమిగ్రెంట్ల దేశంగా గుర్తిస్తుంది. అమెరికాలో దాదాపు 1.10 కోట్ల మంది ఇమిగ్రెంట్లు అక్రమంగా నివసిస్తున్నారు. వీళ్లంతా సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాల వాళ్లు. దేశం నుంచి వెళ్లగొట్టేస్తారన్న భయం ఇప్పటిదాకా వీరిని వెంటాడుతోంది. వీరిలో నేర చరిత్ర లేనోళ్లకు సిటిజన్‌షిప్ ఇచ్చేందుకు బైడెన్ ప్రతిపాదన చేశారు.
15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సైన్
గత ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలను వెనక్కి తీసుకుంటూ కొత్త ప్రెసిడెంట్ బైడెన్ మొదటి రోజే 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. పారిస్ అగ్రిమెంట్ లో చేరడం, డబ్ల్యూహెచ్ వోలో కొనసాగడం, ముస్లిం దేశాల వారిపై ట్రావెల్ బ్యాన్ ను రద్దుచేయడం, మెక్సికో బార్డర్ లో గోడ నిర్మాణాన్ని వెంటనే ఆపడం వంటి నిర్ణయాలకు సంబంధించి బైడెన్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను జారీ చేశారు. కాగా, బైడెన్ ప్రెసిడెన్సీలో అమెరికా, ఇండియా మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మాజీ డిప్లమాట్లు, ఎక్స్ పర్టులు అంచనా వేస్తున్నారు.
ట్రంప్ లెటర్ మస్త్ నచ్చింది: బైడెన్
మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ ను విడిచి వెళ్తూ తనకోసం రాసి ఉంచిన లెటర్ చాలా ఉదారంగా, గొప్పగా ఉందంటూ కొత్త ప్రెసిడెంట్ బైడెన్ మెచ్చుకున్నారు. త్వరలో ట్రంప్‌తో మాట్లాడతానని ప్రెసిడెంట్ బైడెన్ చెప్పారు.
For More News..