ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని మే 22 బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించానని.. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లుగా తెలిపారు సీఎం రేవంత్.
సీఎం హోదాలో తిరుమల శ్రీవారిని తొలిసారి దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు టీటీడీ అధికారులు, అర్చకులు. రేవంత్ రెడ్డి ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.