- మిర్యాలగూడ స్టేషన్ లో ఐదు గంటలకుపైగా నిలిచిపోయిన శబరి ఎక్స్ ప్రెస్
- పిడుగురాళ్ల వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా దామరచర్ల పరిధిలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ క్రాస్ చేస్తున్న గూడ్స్ ట్రెన్ 4,5 నంబర్ బోగీలు ఆదివారం పట్టాలు తప్పాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ప్యాసింజర్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కేరళకు బయల్దేరిన శబరి ఎక్స్ ప్రెస్ ను మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న జన్మభూమి రైలును పిడుగురాళ్ల వద్ద ఆపేశారు.
విష్ణుపురం చేరుకున్న రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైల్వే లైన్‌కు రిపేర్లు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పగా, రాత్రి 7 గంటల వరకు మరమ్మతులు చేసి శబరి ఎక్స్ ప్రెస్‌ను పంపించారు.
స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందజేసిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో శబరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేయడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అక్కడకు చేరుకుని బీఎల్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సుమారు 4 వేల మందికి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందజేశారు.