39 రైళ్లు రద్దు.. ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన

39 రైళ్లు రద్దు.. ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన
  • పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న ట్రాక్ 
  • ఆకస్మికంగా రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఆందోళన 
  • ఘటనా స్థలిని పరిశీలించిన ఎంపీ వంశీకృష్ణ 
  • త్వరగా రిపేర్లు చేయాలంటూ అధికారులకు ఆదేశం

పెద్దపల్లి / సికింద్రాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పి ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్, నాగ్​పూర్​ మధ్య 39 రైళ్లను రైల్వే అధికారులు ఆకస్మికంగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే, ముందస్తు సమాచారం లేకుండా రైళ్లను ఎలా రద్దు చేస్తారంటూ ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్- –కన్నాల మధ్య మంగళవారం రాత్రి ఘజియాబాద్​ నుంచి ఖాజీపేట వైపు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ కాయిల్స్​తో వెళుతున్న రైలు ఓవర్ లోడ్ కారణంగా పట్టాలు తప్పగా.. 11 వ్యాగన్లు బొల్తాపడ్డాయి. ఈ ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆ మార్గంలో పలు రైళ్లను రద్దు చేసింది. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో ప్రయాణికులు ఆందోళన చేశారు. అకస్మాత్తుగా రైళ్లను రద్దు చేస్తే ఎలా అంటూ టికెట్​కౌంటర్ల వద్ద నినాదాలు చేశారు. గూడ్స్ పట్టాలు తప్పినందుకే రద్దు చేశామని అధికారులు, రైల్వే పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. 

ట్రాక్​ను త్వరగా  రిపేర్ చేయాలి.. 

పెద్దపల్లి జిల్లాలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్​ను వేగంగా పునరుద్ధరించాలని రైల్వే అధికారులకు ఎంపీ వంశీకృష్ణ సూచించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన స్థలాన్ని బుధవారం ఎంపీ పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే ప్రమాదాలపై ఆ శాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రమాదాలపై రానున్న పార్లమెంట్‌‌ సమావేశాల్లో ప్రశ్నిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే ఆఫీసర్లతో మాట్లాడి ప్రమాద వివరాలను ఎంపీ తెలుసుకున్నారు. మొత్తం11 వ్యాగన్లు పట్టాలు తప్పడంతో కిలోమీటర్‌‌ మేర రైల్వే ట్రాక్‌‌ ధ్వంసమైందని ఆఫీసర్లు వివరించారు. ట్రాక్‌‌ రిపేర్లు త్వరగా పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించాలని వారికి ఎంపీ సూచించారు. ఎంపీ వెంట నాయకులు మల్లికార్జున్, తొగరి తిరుపతి, తదితరులు ఉన్నారు.