గూగుల్ ఎప్పటికప్పుడు ఫేక్ యాప్‌లపై నిఘా పెట్టి వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తూ వస్తోంది. అయితే హ్యాకర్లు కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటా దోచేసేందుకు జనాల ఇంట్రెస్ట్, ట్రెండ్‌ను బట్టి కొత్త కొత్త యాప్స్‌ను డంప్ చేస్తున్నారు. ఇటీవల కొన్ని నెలలుగా క్రిప్టో కరెన్సీకి మళ్లీ బూమ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ యాప్స్‌తో హ్యాకర్లు రంగంలోకి దిగారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌కు సంబంధించిన యాప్స్ అంటూ స్పైవేర్, మాల్‌వేర్ వైరస్‌తో యాప్స్‌ను ప్లే స్టోర్‌లో పెడుతున్నారు.
ఇలా క్రిప్టో కరెన్సీ యాప్ ద్వారా భారీగా సంపాదించొచ్చంటూ యాడ్స్ ఇస్తూ ఆశ పెట్టి, జనాల డేటా కొట్టేస్తున్న ఎనిమిది ఫేక్ యాప్‌లను సైబర్ సెక్యూరిటీ కంపెనీ ట్రెండ్ మైక్రో గుర్తించింది. జనాలను అట్రాక్ట్ చేయడానికి ఈ యాప్‌లకు సంబంధించి యాడ్స్ కూడా ఇస్తున్నారు హ్యాకర్లు. దీని వలలో పడిన వాళ్ల నుంచి నెలకు సుమారు రూ.1100 (15 డాలర్లు) సబ్‌స్క్రిప్షన్ చార్జ్ కూడా వసూలు చేస్తున్నాయని ఈ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. పైగా ఆ యాప్స్‌లో క్రిప్టో కరెన్సీ మైనింగ్ ద్వారా యూజర్లకు వచ్చేది సున్నా అని పేర్కొంది. పైగా కొన్ని యాప్స్ యూజర్ల ప్రైవేట్ డేటాను యాక్సిస్ చేస్తున్నాయని, దీని వల్ల ప్రైవసీకి భంగం కలగడంతో పాటూ వాళ్ల డిజిటల్ పేమెంట్ల సేఫ్టీ తగ్గిపోతోందని తెలిపింది. అంశాలన్నింటితో కూడిన నివేదికను ట్రెండ్ మైక్రో కంపెనీ గూగుల్ ప్లేకు అందించింది. దీంతో దానిని పరిశీలించిన గూగుల్ ఎనిమిది యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్‌లు ఇకపై ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉండవు. అయితే ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న వాళ్లు కూడా వెంటనే వాటిని డిలీట్ చేస్తే ఫోన్ సేఫ్టీ పరంగా మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ఆ యాప్స్ ఇవే
– BitFunds – Crypto Cloud Mining
– Bitcoin Miner – Cloud Mining
– Bitcoin (BTC) – Pool Mining Cloud Wallet
– Crypto Holic – Bitcoin Cloud Mining
– Daily Bitcoin Rewards – Cloud Based Mining System
- Bitcoin 2021
– MineBit Pro - Crypto Cloud Mining & btc miner
– Ethereum (ETH) - Pool Mining Cloud