14 లక్షల యాప్స్​కు పర్మిషన్ ​ఇవ్వని గూగుల్

 

  • 1.73 లక్షల మోసపూరిత అకౌంట్ల తొలగింపు
  • దీనివల్ల యూజర్లకు 2 బిలియన్​ డాలర్లు ఆదా

న్యూఢిల్లీ: తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండటంతో ప్లేస్టోర్​లోకి రాకుండా కిందటి ఏడాది 14.3 లక్షల యాప్స్​ను అడ్డుకున్నామని గూగుల్​ ప్రకటించింది. ప్లేస్టోర్​ఎకోసిస్టమ్​కు రావాలనుకుంటున్న డెవలపర్లకు కఠినమైన రూల్స్​ పెట్టామని, దీనివల్ల మోసపూరిత యాప్స్​ సంఖ్య విపరీతంగా తగ్గిందని తెలిపింది. గూగుల్ ​బ్లాగ్​ పోస్ట్​ ప్రకారం.. కొత్త సెక్యూరిటీ  ఫీచర్లు, పాలసీలు తేవడం, మెషీన్​ లెర్నింగ్​ సిస్టమ్స్​పై భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్రమ యాప్స్​కు అడ్డుకట్టపడింది. యాప్​ రివ్యూల వల్ల కూడా వీటి​ బెడద కొంత తగ్గుతోంది. యూజర్లను మోసం చేస్తున్నట్టు గుర్తించి.. గడిచిన మూడేళ్లలో ఐదు లక్షల యాప్స్​ను అడ్డుకుంది.

దీనివల్ల యూజర్లకు రెండు బిలియన్​ డాలర్ల డబ్బు ఆదా అయింది. తప్పుదోవ పట్టించే యాడ్స్​ను అడ్డుకోవడంపై గూగుల్​ మరింత దృష్టి పెట్టింది. హఠాత్తుగా వచ్చే ఫుల్ ​స్క్రీన్​ ఇంటెరిస్టీషిల్​ యాడ్స్​ను ఆపేస్తోంది. లోన్​ మోసాలను అడ్డుకోవడానికి రూల్స్​ను కఠినతరం చేసింది. కెన్యా, నైజీరియా, ఫిలిప్పీన్స్​, ఇండియాలో పర్సనల్​ లోన్​ యాప్స్​కు కొత్త లైసెన్సు పద్ధతులను తీసుకొచ్చింది. డేటా ప్రొటెక్షన్​ విషయంలో పారదర్శకతను మరింత పెంచింది. యూజర్ల డేటాను ఎందుకోసం, ఎలా తీసుకుంటున్నారో స్పష్టంగా తెలియజేస్తోంది.

ఇందుకోసం ప్లేస్టోర్​ డేటా సేఫ్టీ సెక్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్​ ప్లేస్టోర్ ​కోసం యాప్స్​ తయారుచేసే డెవలపర్స్​తో కమ్యూనికేషన్​ను మరింత పెంచుకోవడానికి ఈ కంపెనీ  ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్లను, వనరులను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల డెవలపర్లకు మరింత సౌకర్యంగా ఉంటోంది. అంతేగాక హెల్ప్​లైన్​ ప్రాజెక్టును కూడా విస్తరించడం వల్ల డెవలపర్లకు సురక్షితంగా యాప్స్​ను తయారు చేయడానికి సంబంధించిన సమాచారం అంతా అందుబాటులో ఉంటోంది.  ఏవైనా ప్రశ్నలు ఉన్నా తక్షణం జవాబులు దొరుకుతాయి.