‘రెస్ట్ ఇన్ పీస్ టాటాజీ’.. రతన్ మరణంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం

‘రెస్ట్ ఇన్ పీస్ టాటాజీ’.. రతన్ మరణంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం

బిజినెస్ టైకూన్, మానవతా మూర్తి రతన్ రతన్ టాటా మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా గొప్పదనాన్ని కొనియాడటంతో పాటు ఆయనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రతన్ టాటా నిష్క్రమణపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటాతో చివరి సారిగా భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా పిచాయ్ గుర్తు చేసుకున్నారు. గూగుల్‌ కార్యాలయంలో రతన్ టాటాతో చివరిసారిగా సమావేశమయ్యా.. ఆ రోజు మేము వేమో (గూగుల్ సెల్ఫ్-డ్రైవింగ్ కార్ ప్రాజెక్ట్‌) గురించి చర్చించామని తెలిపారు.

రతన్ టాటా విజన్ వినడానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొనియాడారు పిచాయ్. భారతదేశంలోని ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం వహించడం, అభివృద్ధి చేయడంలో రతన్ టాటా కీలక పాత్ర  పోషించారని పేర్కొన్నారు. భారతదేశాన్ని మెరుగుపరచడంపై టాటా చాలా శ్రద్ధ వహించారని వెల్లడించారు. రతన్ టాటా మరణంపై సంతాపం వ్యక్తం చేసిన పిచాయ్.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా సుందర్ పిచాయ్ పోస్ట్ పెట్టారు. 

ALSO READ : రతన్ టాటాను..4 తరాలు ఎందుకు మెచ్చాయి అంటే.. ఈ 10 కారణాల వల్లే..

కాగా, వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా 2024 అక్టోబర్ 9 తేదీన రతన్ టాటా తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టాటా కన్నుమూశారు. భారత వ్యాపారంగలో తనదైన ముద్ర వేసుకోవడంతో పాటు.. వేల కోట్లు రూపాయలు పేదల కోసం ఖర్చు చేసి గొప్ప మానవతావాదిగా పేరు సంపాదించుకున్నారు. రతన్ టాటా మృతితో యావత్ భారతవనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ ఇంట్లో సభ్యుడు కోల్పోయిన రితీలో దేశ పౌరులు బాధను వ్యక్తం చేశారు.