యూజర్లకు ఇబ్బంది.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్స్ డిలీట్

యూజర్లకు ఇబ్బంది.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి 600 యాప్స్ డిలీట్

స్మార్ట్ ఫోన్ యూజర్లను ఇబ్బంది పెడుతున్న యాప్‌ల విషయంలో గూగుల్ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఫోన్లను హ్యాక్ చేస్తున్న, కస్టమర్ల డేటా చోరీ చేస్తున్న యాప్స్‌ను ఏ మాత్రం ఉపేక్షించడం లేదు. ఇటీవలే ఇలా డేటా దొంగిలిస్తున్న యూజర్లపై స్పై చేస్తున్న 24 యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇప్పుడు లేటెస్ట్‌గా తమ నిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న 600 యాప్‌లను డిలీట్ చేసింది.

ఇష్టానుసారం యాడ్స్ వస్తున్నాయని..

కాల్ చేయడానికి డయల్ పాడ్‌పై నంబర్ కొడుతున్నప్పుడో.. ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి ఉన్న వీడియోను చూస్తున్నప్పుడో సడన్‌గా స్క్రీన్‌పై ఏదో పిచ్చి యాడ్ వస్తే ఎలా అనిపిస్తుంది!? చెప్పలేనంత ఇరిటేషన్‌ వస్తుంది కదా.. ఇక పొరబాటున వచ్చి ఆ యాడ్ పాపప్‌ను టచ్ చేస్తే దాని సైట్‌లోకి వెళ్లి సంబంధం లేని చెత్త చూడాల్సిన పరిస్థితి. అసలు ఈ యాడ్స్ ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాదు. దీనికి కారణం మన ఫోన్‌లో ఉండే యాప్‌లే. వాటిని ఓపెన్ చేసి వాడకపోయినా.. యూజర్ వేరే యాక్టివిటీలో ఉన్నప్పుడు యాడ్ నోటిఫికేషన్లను పంపుతుంటాయి. ఇలా వినియోగదారులను వాళ్ల ఫోన్ వాడేటప్పుడు పదేపదే ఇబ్బందిపెట్టడం గూగుల్ ప్లేస్టోర్ నిబంధనలకు విరుద్ధం. ఆ యాడ్స్‌ను ఔటాఫ్ కంటెక్స్ట్, డిస్రప్టివ్ యాడ్స్‌గా పిలుస్తుంది గూగుల్.

మెషీన్ లెర్నింగ్, ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టూల్స్ సాయంతో ఔటాఫ్ కంటెక్స్ట్ యాడ్స్‌పై నిఘా వేసింది గూగుల్. తమ రెగ్యులేషన్స్‌కి విరుద్ధంగా యాడ్ పాపప్ ఇస్తున్న యాప్‌లను గుర్తించి ఏరివేత స్టార్ట్ చేసినట్లు గురువారం ఆ సంస్థ సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ పెర్ బ్జోర్క్ తెలిపారు. ఇందులో భాగంగా ఒకేసారి 600 యాప్స్ తీసేశామన్నారు. ప్లే స్టోర్‌లో ఉన్న 30 లక్షల యాప్‌ల ముందు ప్రస్తుతం డిలీట్ చేసిన వాటి సంఖ్య చాలా తక్కువని చెప్పారు. అయితే డిలీట్ చేసిన వాటిలో కొన్ని యాప్స్‌పై స్పై చేసి.. డేటా దొంగిలించినట్లు కూడా తేలింది. ఈ క్లీన్-అప్ ప్రాసెస్ కొనసాగుతుందని, దీనిపై ప్రత్యేక టీమ్స్ పని చేస్తున్నాయని తెలిపారు పెర్.

450 కోట్ల ఇన్‌స్టాల్స్

ఇప్పుడు తొలగించిన యాప్స్ పేర్లను గూగుల్ ప్రకటించలేదు. అయితే, ఆ యాప్స్ తన ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనూ యాడ్ మానిటైజేషన్ నుంచి బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. ఈ యాప్స్‌ 450 కోట్ల ఇన్‌స్టాల్స్ జరిగాయట. ప్రస్తుతం తొలగించిన వాటిలో ఇండియా, చైనా, హాంకాగ్, సింగపూర్‌ డెవలపర్స్‌కి సంబంధించిన యాప్స్ ఎక్కువగా ఉన్నాయి.