- గూగుల్ డార్క్ వెబ్ రిపోర్టుతో చెక్ చేస్కోవచ్చు
- ఇప్పటివరకు ‘గూగుల్ వన్’ యూజర్లకు మాత్రమే చాన్స్
- ఈ నెలాఖరు నుంచి గూగుల్ యూజర్లు అందరికీ అవకాశం
- ఉచితంగానే చెక్ చేస్కుని.. డేటాను రిమూవ్ చేయొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతి విషయానికీ ఆన్ లైన్ లో పేరు, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయడం కామన్ అయిపోయింది. దీంతో ఆయా సైట్ల నుంచి ప్రజల పర్సనల్ డేటానంతా సైబర్ నేరగాళ్లు ఈజీగా కొట్టేస్తూ లేదా కొంటూ రకరకాలుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. అయితే, గూగుల్ యూజర్లు అందరూ ఇకపై వారి పర్సనల్ డేటా ఇంటర్‌నెట్ లో ఎవరి వద్దయినా ఉందా? అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు.
ఎవరి వద్దయినా మన పర్సనల్ డేటా ఉన్నట్టు తెలిస్తే.. ఆ డేటాను రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం గూగుల్ కంపెనీ ఇదివరకే ‘డార్క్ వెబ్ రిపోర్ట్స్’ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు గూగుల్ వన్ మెంబర్షిప్ (ఎక్స్ ట్రా స్టోరేజ్ కొనుగోలు చేసిన యూజర్లు) ఉన్న వారికి మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి ఉంచింది. కానీ ఈ నెల చివరి నుంచి గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ఆ కంపెనీ ఇటీవలే ప్రకటించింది.
ఈ ఫీచర్ అందుబాటులోకి రాగానే డార్క్ వెబ్ రిపోర్ట్ కోసం మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఒకసారి రిక్వెస్ట్ పెట్టగానే ఇంటర్ నెట్లో మన డేటాను అంతా గూగుల్ వెతుకుంది. ఎవరి వద్దయినా మన డేటా ఉన్నట్టు గుర్తిస్తే ఆ విషయాన్ని నోటిఫికేషన్/ఈమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. రిపోర్ట్‌ను చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ డేటాను రిమూవ్ చేసుకోవచ్చు.
‘డార్క్ వెబ్ రిపోర్ట్’ ఇలా పొందాలి..
స్టెప్ 1: గూగుల్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. మెనూను ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్ అవతార్ పై క్లిక్ చేయాలి. మెనూ నుంచి ‘రిజల్ట్స్ అబౌట్ యూ’ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి.
స్టెప్ 2: ‘గెట్ స్టార్టెడ్’ అనే ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ పూర్తి పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి.
స్టెప్ 4: గూగుల్ యాప్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అలర్ట్ లను రిసీవ్ చేసుకునేందుకు నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను ఆన్ చేయాలి. ఆ వెంటనే.. ‘మీ పేరు, కాంటాక్ట్ వివరాల సమాచారం కోసం సెర్చ్ చేస్తున్నాం’ అని స్క్రీన్‌పై ఒక పాపప్ వస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తయ్యేందుకు కొన్ని గంటల టైం పట్టవచ్చు. సెర్చింగ్ పూర్తి కాగానే నోటిఫికేషన్ వస్తుంది.
స్టెప్ 5: సెర్చ్ పూర్తయినట్టు నోటిఫికేషన్ రాగానే ‘రిజల్ట్స్ టు రివ్యూ’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మన పర్సనల్ డేటా ఎవరితో ఉందో
చెక్ చేసుకోవాలి. వారి వద్ద ఉన్న డేటాను తొలగించాలనుకుంటే రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.