టెక్స్ట్ డాక్యుమెంట్లను దాచుకోవడానికి, వాటిని అవసరమైనప్పుడు ఎడిట్ చేయడానికి చాలామంది గూగుల్ డాక్స్ వాడతారు. ఈ అప్లికేషన్ యూజర్లకు మరింత ఉపయోగపడేలా చేసేందుకు ఈ మధ్యే కొన్ని ఫీచర్లు యాడ్ చేసింది గూగుల్. గూగుల్ డాక్స్ నుంచి ఇ–మెయిల్స్ పంపడమే కాకుండా లింక్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. అలాగే గూగుల్ నుంచి నేరుగా ఫొటోల్ని ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. అంతేకాదు వాయిస్ టైపింగ్, స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేయడం ఈజీ.
ఇకపై గూగుల్ డాక్స్ నుంచి డ్రాఫ్ట్స్, ఇ–మెయిల్స్ పంపొచ్చు. ఇన్సర్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి, ‘బిల్డింగ్ బ్లాక్స్’ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ‘ఇ–మెయిల్ డ్రాఫ్ట్’ కనిపిస్తుంది. అది అచ్చం జి–మెయిల్ కంపోజ్ చేసే విండో లాగ ఉంటుంది. ఇందులో టైప్ చేసే టెక్స్ట్ అటాచ్మెంట్లా కాకుండా ఇ–మెయిల్లో ఉన్నట్టే బాడీ టెక్స్ట్‌లా కనిపిస్తుంది.
లింక్స్ సెర్చ్
టెక్స్ట్‌లో ముఖ్యమైన పదాల్ని, వెబ్సైట్ల పేర్లను హైలైట్ చేసేందుకు వాటిని హైపర్లింక్స్గా మార్చేస్తారు చాలామంది. అందుకోసం ఆ పదాన్ని కాపీ చేసి హైపర్లింక్ బాక్స్‌లో పేస్ట్ చేయాలి. ఆ పద్ధతిలో ఎక్కువ లింక్స్ క్రియేట్ చేసేందుకు చాలా టైమ్ పడుతుంది. ఇప్పుడు గూగుల్ డాక్స్ ద్వారా ఆ పని తొందరగా అయిపోతుంది. హైలైట్ చేయాలనుకున్న పదాల మీద క్లిక్ చేయగానే యుఆర్ఎల్ (యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్)ని చూపిస్తుంది గూగుల్ డాక్స్.
ఫొటోలు డైరెక్ట్‌గా
గూగుల్ నుంచి ఫొటోలు డౌన్లోడ్ చేసి, వాటిని గూగుల్ డాక్స్‌లో పోస్ట్ చేస్తుంటారు చాలామంది. అలాకాకుండా నేరుగా గూగుల్‌లో నుంచి ఫొటోల్ని గూగుల్ డాక్స్‌లో పోస్ట్ చేయొచ్చు. అందుకోసం... గూగుల్ డాక్స్‌లో ఇన్సర్ట్ ఇమేజ్‌లోకి వెళ్లాలి. ఇమేజ్ సెక్షన్ కింద ఉన్న ‘సెర్చ్ ది వెబ్’ ఆప్షన్ మీద క్లిక్ చేసి గూగుల్‌లో అనుకున్న ఫొటోలన్ని సెర్చ్ చేయాలి. అంతే గూగుల్ డాక్స్లోకి ఫొటోలు వచ్చేస్తాయి.
వాయిస్ టైపింగ్ ఫీచర్
మాటల్ని, అక్షరాలుగా మార్చే ఫీచర్ గూగుల్ డాక్స్‌లో ఉంది. Control + Shift+ S shortcut ని వాడితే వాయిస్ టైపింగ్ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
నచ్చిన ఫార్మాట్...
గూగుల్ డాక్స్‌లో ఫైల్స్ డీఫాల్ట్‌గా డాక్స్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. వాటిని డాక్స్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ ఫైల్స్‌ని పిడిఎఫ్, టెక్స్ట్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైల్ మెనులో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అందులో అవసరమైన ఫార్మాట్‌ని సెలక్ట్ చేసుకోవాలి.
మల్టీమీడియా ట్వీట్
ట్విట్టర్ త్వరలోనే ‘మల్టీమీడియా ట్వీట్’ అనే కొత్త ఫీచర్ తీసుకురాబోతోంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే... పోస్ట్‌తో పాటు ఫొటో, వీడియో, జిఎఫ్ ఫైల్స్‌ని కూడా పంపొచ్చు. అంతేకాదు మల్టీమీడియా ట్వీట్‌కి ఎవరినైనా ట్యాగ్ చేయొచ్చు చూడా. ఇదేకాకుండా యూజర్లు ఒక నెలలో ఎన్ని ట్వీట్స్ చేశారు అనేది తెలుసుకునేందుకు మరో ఫీచర్ కూడా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది ట్విట్టర్.
వాట్సాప్‌తో క్యాబ్ బుకింగ్
ఓలా, ఉబెర్, ర్యాపిడో.... వీటిలో క్యాబ్ బుక్ చేయాలంటే యాప్ కచ్చితంగా ఉండాలి. మరి యాప్ లేనివాళ్ల పరిస్థితి ఏంటి?. అలాంటివాళ్లకు వాట్సాప్ ఉంటే చాలు. వాట్సాప్‌తో క్యాబ్ బుక్ చేసుకునే ఫీచర్ తెచ్చింది ఉబెర్ సంస్థ. అందుకోసం వాట్సాప్ నుంచి 7292000002 నెంబర్‌కి మెసేజ్ పెట్టాలి. వెంటనే చాట్‌బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పికప్, డ్రాప్ లొకేషన్ పోస్ట్ చేయాలి. కొంచెం సేపటికి రైడ్‌కి అయ్యే ఛార్జ్, డ్రైవర్ ఎవరు వస్తున్నారు, క్యాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది అనే వివరాలు వస్తాయి. ఆ మెసేజ్‌ని క్యాబ్ డ్రైవర్‌కి చూపించాలి. ఇప్పటివరకైతే ఈ ఫీచర్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది.
స్పోటిఫైలో ఫ్రెండ్స్ మిక్స్ ఫీచర్
కొత్త పాటలు, ఫ్రెండ్స్ ఎక్కువగా వినే పాటల్ని వాళ్లతో కలిసి ఒక ప్లే లిస్ట్‌గా చేయొచ్చు. వాటిని షేర్ చేయొచ్చు కూడా. ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్‌గా ‘ఫ్రెండ్స్ మిక్స్’ అనే ఫీచర్ తీసుకొచ్చింది స్పోటి ఫై యాప్. దీనివల్ల యూజర్లు ఒకేసారి మూడు బ్లెండ్ ప్లే లిస్ట్‌లు చేసుకోవచ్చు. ఒకేసారి పదిమంది ఫ్రెండ్స్‌తో మిడ్లే క్రియేట్ చేయొచ్చు. ఈ కొత్త ప్లే లిస్ట్ ‘మేడ్ ఫర్ అజ్’ ట్యాబ్ కింద ఆటోమెటిక్‌గా కనిపిస్తుంది. ఐఒఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రయిబర్స్‌తో పాటు సబ్స్క్రిప్షన్ తీసుకోనివాళ్లు కూడా ఈ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు.