ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 ఏడాదికి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారు. ధూంధాంగా వేడుకలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలు, విషాదాలు నెమరేసుకుంటూ 2024 ప్రశాంతంగా సాగాలని కోరుతూ వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు. సందర్భానుసారంగా ఎప్పుడూ వినూత్నంగా గూగుల్ ప్రదర్శించే డూడుల్ సంవత్సరం చివరి రోజు కావడంతో ఇవాళ కూడా డూడుల్ ని ప్రదర్శించింది. ఎప్పటిలాగే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ యానిమేటెడ్ వైబ్రెంట్ డూడుల్‌ను షేర్ చేసి వినూత్నంగా ముగింపును పలికింది. ఈ ఏడాది జరిగిన మంచి చెడును ప్రతిబింబిస్తూ.. వచ్చే ఏడాది ఎన్నో ఆకాంక్షలను డూడుల్ ప్రతిబింబిస్తోంది.
నూతన సంవత్సర పండుగ అంటే ప్రజలు తమ గతాన్ని మరచిపోయి, కొత్తగా ప్రారంభించాలని ఎదురుచూసే సమయం. నేర్చుకునే విషయాలను తిరిగి చూసుకోవడానికి, ఆలోచించడానికి సరైన అవకాశం. చాలా మంది న్యూ ఇయర్ సందర్భంగా రిజల్యూషన్స్ చేసుకుంటారు. వాటిని కచ్చితంగా అమలుపరిచి లక్ష్యాలను చేరుకోవడానికి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేక ఈవెంట్‌ల కోసం క్రియేటివ్, ఇంటరాక్టివ్ డూడుల్‌లను రూపొందించడంలో Google ప్రసిద్ధి చెందింది. ప్రముఖ వ్యక్తులు, వారి విజయాలను కూడా గూగుల్ డూడుల్ రూపంలో ప్రదర్శిస్తూ వస్తోంది.
ఈ యానిమేటెడ్ డూడుల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సహా పలు ప్రత్యేక సందర్భాలలో వినూత్న డూడుల్స్ తో వారికి నివాళులు తెలియజేయడం గూగుల్ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. దీంతో పాటు న్యూఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు తాజాగా ఈ సరికొత్త డూడుల్ ను రూపొందించింది.