తమ విధానాలను ఉల్లంఘిస్తున్న మూడు పాపులర్ యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మూడింటికి కలపి దాదాపు 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఇంటర్నేషనల్ డిజిటల్ అకౌంటబిలిటీ కౌన్సిల్ (ఐడీఎసీ) నుంచి ఒత్తిడి రావడంతో పిల్లలు ఉపయోగించే మూడు యాప్‌లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. పిల్లలు ఎక్కువగా ఉపయోగించే ప్రిన్సెస్ సలోన్, నంబర్ కలరింగ్, మరియు క్యాట్స్ & కాస్ప్లే యాప్‌లు ప్లే స్టోర్ విధానాలను ఉల్లంఘిస్తూ.. చాలా సందర్భాలలో పిల్లల డేటాను సేకరిస్తున్నాయని ఐడీఎసీ గుర్తించింది. ఈ మూడు యాప్‌లు పిల్లల డేటాను థర్డ్ పార్టీలకు లీక్ చేస్తున్నాయని ఐడీఎసీ తెలిపింది.
‘ఈ మూడు యాప్‌లు డేటాను లీక్ చేస్తున్నాయని మా పరిశోధనలో గమనించాం. దాంతో ఈ యాప్‌లపై తీవ్రమైన ఆందోళనలు కలిగాయి’ అని ఐడీఎసీ అధ్యక్షుడు క్వెంటిన్ పాల్ఫ్రే తెలిపారు.
ఈ విషయంపై గూగుల్ కూడా స్పందించింది. ‘ఐడీఎసీ నివేదికలో ప్రస్తావించబడిన మూడు యాప్‌లు గూగుల్ నుంచి తొలగించబడ్డాయి. మా విధానాలను ఉల్లంఘించే యాప్‌లు మా దృష్టికి వస్తే మేం తప్పకుండా చర్య తీసుకుంటాం’అని తెలిపింది. కాగా.. ఈ మూడు యాప్‌లు ఏ విధమైన డేటాను సేకరిస్తున్నాయనే దానపై స్పష్టత లేదు. పిల్లలు గేమ్‌ల కోసం ఈ యాప్‌లను ఉపయోగిస్తుంటారు. గూగుల్ మరియు ఆపిల్ చేత నిర్వహించబడే యాప్ స్టోర్లలో ఇటువంటి యాప్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ సంస్థ పిల్లల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ కిడ్స్ అనే యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
పిల్లల డేటా విషయానికి వస్తే.. ఆపిల్ మరియు గూగుల్ వంటి సంస్థలు యాప్ డెవలపర్లకు కొన్ని షరతులు విధిస్తాయి. పిల్లల డేటాను చాలా జాగ్రత్తగా ఉంచేలా చూస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ థర్డ్ పార్టీలకు పంపకూడదని హెచ్చరిస్తాయి. కొన్ని దేశాలలో పిల్లలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా నియంత్రించే నియమాలు అమలులో ఉన్నాయి. కాగా.. గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి యాప్‌లను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు, కంపెనీ తన ప్లే స్టోర్ నుంచి అనేక హానికరమైన యాప్‌లను తొలగించింది.
For More News..