న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పాపులర్ డూడుల్ సిరీస్ ను తిరిగి లాంచ్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. ఈ వారం మొదటి నుంచి డూడుల్ గేమ్స్ లో కొన్నింటిని గూగుల్ షేర్ చేస్తోంది. కరోనా లాక్ డౌన్ తో దొరికిన ఖాళీ సమయాన్ని ప్రజలు ఇంటరాక్టివ్ గేమ్స్ ఆడటానికి యూజ్ చేసుకుంటారని గూగుల్ భావిస్తోంది. ప్రపంచంలోని అన్ని కమ్యూనిటీస్, ప్రజలు, ఫ్యామిలీస్ పై కరోనా తన ప్రభావాన్ని కొనసాగిస్తోందని గూగుల్ డూడుల్ పేజ్ తెలిపింది. కరోనాను ఎదుర్కోవడంలో ముందు వరుసలో పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, హెల్త్ కేర్ వర్కర్స్, డెలివరీ ఎంప్లాయీస్ కు గూగుల్ డూడుల్ కృతజ్ఞతలు చెప్పింది.
నేటి గూగుల్ డూడుల్ లో సొంతంగా విజువల్ మ్యూజిక్ కంపోజిషన్ చేయొచ్చు. గూగుల్ యానిమేటెడ్ లోగోపై క్లిక్ చేయగానే ‘ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ గేమ్స్ ఆడండి’ అని దర్శనమిస్తోంది. బుధవారం ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఆస్కార్ విజువల్ ఆర్టిస్ట్ ఫిషింగర్ ను గుర్తు చేస్తూ గూగుల్ డూడుల్ సెలబ్రేట్ చేస్తోంది. 2017 జూలై 22న (ఫిషింగర్ 117వ జన్మదినం సందర్భంగా) ఈ డూడుల్ ను గూగుల్ పబ్లిష్ చేసింది.