టెక్నాలజీ : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్

టెక్నాలజీ : గూగుల్  మ్యాజిక్ ఎడిటర్

గూగుల్  మ్యాజిక్ ఎడిటర్

గూగుల్ కొత్తగా మ్యాజిక్ ఎడిటర్ యాప్‌ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ ఈ సర్వీసులు ఉచితం. మొదట్లో పిక్సెల్ 8, పిక్సెల్​ 8 ప్రొ సిరీస్‌లో మాత్రమే ఇవి ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఫొటోలను వాడే యూజర్లందరికీ ఉచితంగా అందిస్తోంది. ఇది పవర్​ఫుల్ ఏఐ పవర్డ్ ఫొటో ఎడిటింగ్ యాప్. 
మ్యాజిక్ ఎడిటర్ (Magic Editor)  అనేది గూగుల్ పిక్సెల్​ ఏఐకి సంబంధించిన ఎడిటింగ్ యాప్. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ)ని ఉపయోగించి, యూజర్లు తీసిన ఫొటోలను మంచిగా చూపిస్తుంది.  ఈ ఎడిటింగ్​ యాప్​తో గందరగోళంగా ఉన్న ఫొటోల నుంచి కదిలే వస్తువులను కూడా ఈజీగా తీసేస్తుంది. ఫొటో బ్యాక్​గ్రౌండ్​ని కూడా మార్చేస్తుంది. గూగుల్ ఫొటోలు వాడే యూజర్ అయితే దీనికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. మ్యాజిక్ ఎడిటర్‌ని యాక్సెస్ చేయడానికి గూగుల్ ఫొటోల కాటగిరీలో ఉన్న సర్కిల్‌పైన ట్యాప్ చేయాలి.

షరతులు వర్తిస్తాయి!

గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ అందరికీ ఉచితమే.. అయితే ఎక్కువ ఫొటోలు ఎడిటింగ్ చేసేందుకు ఈ యాప్ పర్మిషన్ ఇవ్వదు. ప్రతి ఒక్క యూజర్ మ్యాజిక్ ఎడిటర్‌లో మ్యాగ్జిమమ్10 ఫొటోలు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఫొటోలు ఎడిట్ చేయాలంటే, గూగుల్ వన్  ప్రీమియం(2+TB) ప్లాన్ తీసుకోవాలి లేదా పిక్సెల్ యూజర్ అయ్యుండాలి. అంతేకాదు.. ఈ ఎడిటింగ్​ యాప్‌ వాడాలంటే, ఫోన్‌లో 64 బిట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్, 4జీబీ ర్యామ్​ ఉండాలి.

ఫ్రీ యాప్స్

గూగుల్ మ్యాజిక్ ఎడిటర్‌తో పాటు అనేక యాప్స్ ఫ్రీగా వాడొచ్చు. వాటిలో.. మ్యాజిక్ ఎరేజర్, HDR ఎఫెక్ట్స్, పోట్రెయిట్ బ్లర్, అన్​ బ్లర్, స్కై సజెషన్, కలర్ పాప్, సినిమాటిక్ ఫొటోస్ వంటివి ఉన్నాయి. ఫొటోలతో పాటు వీడియోలను కూడా ఈ  యాప్​లో ఎడిట్​ చేయొచ్చు.

ఐ ఫోన్​లో రింగ్​టోన్ 

ఐ ఫోన్​లో రింగ్​టోన్ మార్చే ఫెసిలిటీ ఉంటుంది. కానీ చాలామంది తమ మనసుకు ఎంతో దగ్గరైన వాళ్ల​ కోసం స్పెషల్ రింగ్ టోన్ పెట్టుకోవాలి అనుకుంటారు. అలా చేయాలంటే యాప్​ స్టోర్​ నుంచి ఆ రింగ్​ టోన్​ కొనాలి. లేదంటే ముందుగా సెట్ చేసిన ఆప్షన్స్​ వాడుకోవాలి.ఈ రెండు ఆప్షన్స్​ నచ్చకపోతే మూడో ఆప్షన్ ఉంది. అదే నచ్చిన రింగ్​టోన్​ని మీకు మీరే క్రియేట్ చేసుకోవడం.

అదెలాగంటే...ఐఫోన్​లో గ్యారేజీ బ్యాండ్​ ఓపెన్​ చేయాలి. ట్రాక్స్ ఆప్షన్​లోకి వెళ్లి, స్వైప్ చేస్తూ పోతే ఆడియో రికార్డర్ సెక్షన్ కనిపిస్తుంది. అందులో లూప్ బ్రౌజర్ సింబల్​ మీద ట్యాప్ చేసి ఫైల్స్ యాప్​ నుంచి ఆడియో ఫైల్​ను ఇంపోర్ట్​ చేయాలి. దీన్ని గ్యారేజీబ్యాండ్ వర్క్​స్పేస్​లోకి తీసుకెళ్లాలి. మ్యాగ్జిమమ్ 30 సెకండ్ల వరకు ఉంచి కట్ చేయాలి. ఎడమవైపు పైన కిందికి చూపించే బాణం గుర్తును ట్యాప్ చేసి సేవ్​ చేయాలి. తర్వాత మై సాంగ్స్​లోకి వెళ్లి షేర్ ఆప్షన్ ద్వారా యాజ్ ఎ రింగ్​టోన్ రూపంలో ఎక్స్​పోర్ట్ చేయాలి. దాన్ని ఫోన్ రింగ్​టోన్​గా లేదా కాంటాక్ట్ రింగ్​టోన్​గా సెట్ చేసుకోవచ్చు. 

మై సేఫ్టీపిన్

అమ్మాయిలు, ఆడవాళ్లు కొన్నిసార్లు రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. వెళ్లడానికి ధైర్యంగానే వెళ్తారు. కానీ, రోడ్డు మీద నడిచేటప్పుడు మనసులో ఒక మూల భయం వేస్తుంటుంది. అలాంటప్పుడు ‘మై సేఫ్టీపిన్’ యాప్ మీకు తోడుగా ఉంటుంది. ఈ యాప్​ను ఆన్​ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారనేది మీ వాళ్లు ట్రాక్‌ చేసే వీలుంటుంది.

‘మై సేఫ్టీపిన్ యాప్​’ లాగ్‌ఇన్‌ అయ్యేటప్పుడు మీకు అవసరపడే ఐదుగురు వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను ఎంటర్‌ చేయాలి. ఆ నెంబర్లకు ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు యూజర్ మూమెంట్స్ మెసేజ్‌ల రూపంలో వెళ్తాయి. ఈ యాప్​ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌ నెంబర్‌తో లాగిన్‌ అయ్యాక పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్​ చేస్తే వెరిఫికేషన్‌ పూర్తయినట్టే. ఆ తరువాత మెయిల్‌ ఐడీ, పుట్టిన తేదీ నమోదు చేయాలి. మీరు ఎటు వెళ్తున్నారు అనే వివరాలు ఎంటర్​ చేయాలంటే లొకేషన్​ పర్మిషన్​ అవసరం.

అన్ని వివరాలు పోలీసుల నిఘాలోకి వెళ్తాయి. ‘మై సేఫ్టీపిన్‌’ యాప్‌ ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాల సేఫ్టీ స్కోర్‌ తెలుసుకోవచ్చు. అంతేకాదు కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఉండేందుకు సేఫ్​గా ఉన్న ప్లేస్​లు ఏంటనేవి కూడా ఈ యాప్‌ సూచిస్తుంది. అలాగే వెళ్లే దారిలో జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్​లు, సెక్యూరిటీ ఉన్న ప్లేస్​లు, బస్‌స్టాప్‌, రైల్వే స్టేషన్‌, మెట్రోస్టేషన్‌ వంటి వాటి వివరాలు చూపిస్తుంది. ఈ యాప్​ని మహిళా హక్కుల కార్యకర్తలు కల్పనా విశ్వనాథ్‌, ఆశిష్‌ బసు కలిసి 2013లో తయారుచేశారు. ఈ యాప్​ మీ దగ్గర లేకపోతే  వెంటనే దీన్ని ఇన్​స్టాల్ చేసుకోండి.