Google Maps: హమ్మయ్య.. గూగుల్ మ్యాప్స్ ఇప్పటికి గుడ్ న్యూస్ చెప్పింది..

Google Maps: హమ్మయ్య.. గూగుల్ మ్యాప్స్ ఇప్పటికి గుడ్ న్యూస్ చెప్పింది..

ఒకప్పుడు మనకు తెలియని ప్రాంతానికి వెళితే ‘ఈ అడ్రస్ ఎక్కడో కొంచెం చెప్తారా..?’ అని స్థానికులను అడిగి వెళ్లాల్సొచ్చేది. నగరాల్లో ఉండే బిజీ జనానికి అడ్రస్ చెప్పేంత ఓపిక కూడా ఉండదు. ఉరుకులపరుగుల లైఫ్ స్టైల్తో సిటీ జనం పరుగులు పెడుతుంటారు. అడ్రస్ చెప్పడం లేదని ఎవరినీ నిందించే పరిస్థితి కూడా లేదు. ఎవరి బిజీ లైఫ్ వాళ్లది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ తిప్పలు తప్పాయి. గూగుల్ మ్యాప్స్ వచ్చాక దాదాపుగా అడ్రస్ కోసం మరొకరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటున్నారు.. లొకేషన్ రీచ్ అవుతున్నారు. అయితే.. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ కోసం గందరగోళానికి గురిచేస్తుంటుంది. ఫ్లైఓవర్స్ దగ్గర గూగుల్ మ్యాప్స్ కూడా అప్పుడప్పుడూ బోల్తా కొట్టిస్తుంది. గూగుల్ మ్యాప్స్ యూజర్లకు ఎదురవుతున్న ఈ సమస్యలకు చెక్ పెట్టాలని గూగుల్ నిర్ణయించింది. 

ఫ్లై ఓవర్కు సంబంధించి గూగుల్ మ్యాప్స్ ముందుగానే గైడెన్స్ ఇచ్చేలా ఫ్లైఓవర్ కాలౌట్స్ (Flyover callouts) ఫీచర్ను గూగుల్ డెవలప్ చేస్తోంది. వెళుతున్న మార్గంలో ఫ్లై ఓవర్లు ఎక్కడున్నాయో ముందుగానే తెలుసుకునే వెసులుబాటు కల్పించాలని గూగుల్ నిర్ణయించింది. ఫ్లైఓవర్ కాలౌట్స్ (Flyover callouts) అనే ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్లో త్వరలో అందుబాటులోకి రానుంది. భారత్లోని 40 నగరాల్లో గూగుల్ మ్యాప్స్లో నావిగేషన్ ఎంచుకునే  ఫోర్ వీలర్, టూ వీలర్ వాహనదారులకు Flyover callouts అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ భావిస్తోంది. 

అంతేకాదు.. ఫోర్ వీలర్స్ డ్రైవ్ చేసేవారికి ఇరుకైన రోడ్ల బాధలు తప్పించేందుకు రోడ్డు వెడల్పును ముందుగానే తెలిపే ఫీచర్ను తీసుకురావాలని నిర్ణయించింది. స్ట్రీట్ వ్యూ ఇమేజరీ, శాటిలైట్ ద్వారా రోడ్డు వెడల్పును ఫోవీలర్ వాహనదారుడు ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ ను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్, గౌహతి నగరాల్లో ఈ వారాంతానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగిస్తున్న వారికి కూడా గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడున్నాయో తెలిపే ఫీచర్ను గూగుల్ మ్యాప్స్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది.