హైదరాబాద్, వెలుగు: ఇన్నోవేటర్లకు సాయం చేయడానికి గూగుల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వశాఖ (మైటీ) చేతులు కలిపాయి. గ్లోబల్ యాప్ డెవెలప్మెంట్, గేమ్ ఇన్నోవేషన్ లను ఎంకరేజ్ చేసేందుకు 100 స్టార్టప్ లకు ట్రెయినింగ్ ఇవ్వనున్నాయి. ఇందుకోసం 2022 సంవత్సరానికి యాప్ స్కేల్ క్లాస్‌ను ప్రకటించాయి. వీటిలో ఆరు హైదరాబాద్ స్టార్టప్‌లు కూడా ఉంటాయి. ట్రెయినింగ్ తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది టైర్ 2, టైర్ 3 నగరాలవాళ్లు. 58 శాతం మంది మహిళలూ ఉన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్, ఫైనాన్స్, ఆన్లైన్ బిజినెస్, గేమింగ్ సంబంధించిన విషయాల్లో ఈ ట్రెయినింగ్ ఉంటుంది. మన దేశంలోని కంపెనీలు 2021లో డెవలప్ చేసిన కొన్ని యాప్స్, గేమ్స్‌కు దేశ, విదేశాల్లో ఆదరణ వస్తోంది. గేమర్లు యాప్స్‌పై గడిపిన సమయం 2019 తో పోలిస్తే 2021 లో150 శాతం పెరిగింది. ఇది దేశీయ స్టార్టప్ లు, డెవలపర్ల సత్తాను నిరూపిస్తోంది. ఇప్పుడు వీళ్లు అంతర్జాతీయంగా తమ యాప్‌లు, గేమ్‌లను లాంఛ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలా గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సాయపడటానికి గూగుల్, ఐటీ మినిస్ట్రీలు చొరవ తీసుకుంటున్నాయి. ఇన్నోవేటివ్ కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి కేంద్రఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ‘మైటీ స్టార్టప్ హబ్’ గూగుల్ కలిసి యాప్ స్కేల్ అకాడమీని అందుబాటులోకి తెచ్చాయి. హైక్వాలిటీ గ్లోబల్ యాప్ లను, గేమ్ లను రూపొందించడంలో 100 చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లకు ఈ మైటీ స్టార్టప్ హబ్ సాయం చేస్తుంది. ఈ ఆరు నెలల ట్రెయినింగ్‌లో భాగంగా, స్టార్టప్‌లకు యూఎక్స్ డిజైన్, బిజినెస్ మోడల్, మానిటైజేషన్ స్ట్రాటజీలు, గ్లోబల్ మార్కెటింగ్ స్ట్రేటజీలు, డేటా సేఫ్టీ, సెక్యూరిటీ విధానాలపై సెషన్లను ఏర్పాటు చేస్తారు. ప్రపంచ మార్కెట్ కోసం హైక్వాలిటీ యాప్‌లను రన్ చేయడంలో సహాయపడతారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కస్టమైజ్డ్ కరిక్యులమ్ కూడా ఉంది. వర్చువల్‌గా వెబినార్లు నిర్వహిస్తారు. సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఇస్తారు.
మొత్తం 400 అప్లికేషన్లు
యాప్ స్కేల్ అకాడమీలోని స్టార్టప్ లు కొత్త తరహా, సొంత ఇన్నోవేషన్లతో రోజువారీ అవసరాలతోపాటు, కొన్ని ప్రత్యేక అవసరాలను కూడా తీరుస్తున్నాయి. కోడింగ్ లెర్నింగ్ యాప్ ప్రోగ్రామ్, స్పోర్ట్స్ యాప్ పాజిబుల్ 11, వ్యాపారాలను నిర్వహించడానికి వన్ స్టాప్ షాప్ యాప్ జొబేజ్ పీఓఎస్, ఆన్ లైన్ స్టోర్లు సృష్టించడానికి క్విక్బాక్స్ సెల్లర్ డాట్ స్లింక్ డాట్ఐకో, క్యాట్ టౌన్ మొబైల్ వంటి అద్భుతమైన గేమ్‌లు సహా మరికొన్ని కేటగిరీలకు చెందిన ఆరు హైదరాబాద్ స్టార్టప్ లు ఈ ట్రెయినింగ్‌కు ఎంపికయ్యాయి. దేశంలోని స్టార్టప్ లను గుర్తించడం, వాటికి మద్దతు ఇవ్వడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలుగా ఎదగడానికి వారికి సహాయపడటం మైటీ స్టార్టప్ హబ్, గూగుల్ చేపట్టిన యాప్ స్కేల్ అకాడమీ లక్ష్యాలు. మొత్తం 400కు పైగా దరఖాస్తులు రాగా, అందులోంచి 100 స్టార్టప్‌లను ఎంచుకున్నారు. ముఖ్యంగా కొత్త తరహా ఆలోచనలు, ఇన్నోవేషన్లు, ప్రొడక్ట్ క్వాలిటీ, స్కేలబిలిటీ వంటి అంశాల ఆధారంగా వీటిని సెలెక్ట్ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, సామాజికం, ఈ–కామర్స్ గేమింగ్ ఈ గ్రూపులోని ముఖ్యమైన సెక్టార్లు. వ్యవసాయం, బీ2బీ, పేరెంటింగ్‌కు సాయపడే ఎన్నో క్రియేటివ్ యాప్‌ల స్టార్టప్‌లూ ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా గూగుల్ ప్లే పార్ట్‌నర్‌షిప్స్ వైస్–ప్రెసిడెంట్ పూర్ణిమా కొచ్చికర్ మాట్లాడుతూ, “గ్లోబల్ యాప్ ఇన్నోవేషన్ విషయంలో మన దేశం మొదటిస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద సైజులలో అన్ని చోట్ల నుంచి స్టార్టప్‌లు వచ్చి, గ్లోబల్ యాప్ ఎకోసిస్టంలో తమ సత్తా చాటుతున్నాయి. వీటికి దేశ విదేశాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మైటీ స్టార్టప్ హబ్ చేస్తున్న సాయానికి మేం థ్యాంక్స్ చెబుతున్నాం. భారతదేశంలో కొత్త యాప్ ఎకోసిస్టమ్‌ని పెంపొందించే దిశగా మరో ముందడుగు వేయడానికి ఎదురుచూస్తున్నాం. ఇన్నోవేషన్, సాహసాల ద్వారా మాకు స్ఫూర్తినిచ్చిన 100 మంది యాప్-ప్రెన్యూర్ల టీమ్‌కు యాప్ స్కేల్ అకాడమీ వెల్కమ్ చెబుతోంది’’ అని అన్నారు. మైటీ జాయింట్ సెక్రటరీ భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ, ‘‘భారతదేశపు డిజిటల్ ప్రయాణానికి స్టార్టప్ లు, డెవలపర్లే కీలక భాగస్వాములు. వీళ్లు భారతదేశానికి, ప్రపంచానికి అవసరమైన సొల్యూషన్స్‌ను అందిస్తున్నారు. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రియేటివ్ యాప్-ప్రెన్యూర్ల కొత్త తరం వచ్చింది. గూగుల్ తో భాగస్వామ్యానికి మైటీ ఎంతో విలువ ఇస్తుంది. యాప్ స్కేల్ అకాడమీ ప్రోగ్రామ్‌తో స్టార్టప్‌లకు ఎంతో మేలు జరుగుతుంది’’ అని తెలిపారు. మైటీ స్టార్టప్ హబ్ సీఈఓ జీత్ విజయ్ మాట్లాడుతూ ‘‘ప్రపంచానికి యాప్ లను, గేమ్‌లను అందిస్తున్న స్టార్టప్‌లకు నాలెడ్జ్, మెంటార్ షిప్ తో సాయం చేయడమే యాప్ స్కేల్ అకాడమీ టార్గెట్. 100 దేశీయ స్టార్టప్‌లతో కూడిన ఈ బృందం మన రోజువారీ అవసరాలతోపాటు, కొన్ని ప్రత్యేక అవసరాలను తీర్చేందుకే యాప్‌ల డెవెలప్‌మెంట్‌పై ఫోకస్ చేస్తోంది”అని అన్నారు.
మరిన్ని వార్తల కోసం..