స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజూకూ పెరిగిపోతోంది. దీంతో చాలా మొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో సెల్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అన్నీ సేవలను సెల్ ఫోన్లతోనే పొందేలా…కొత్త కొత్త ఫీచర్లతో కస్టమర్లకు అనుకూలంగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. ప్రజలు కూడా లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే గూగుల్ పిక్సెల్ సిరీస్ నుంచి నాలుగో మొబైల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గత నెలలో ప్రకటించింది. తాజాగా ఆ ఫోన్ గురించి గూగుల్ కొన్ని అంశాలను అధికారికంగా ప్రకటించింది.
త్వరలో రానున్న పిక్సెల్ 4లో మోషన్ సెన్స్, సరికొత్త ఫేస్‌అన్‌లాక్ లాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయని తెలిపింది. పిక్సెల్ మోడళ్లలో ఈ తరహా ఫీచర్లతో రావడం ఇదే మొదటి సారి. మొబైల్ ‘ఆత్మ’గా భావిస్తున్న మోషన్ సెన్స్ ఫీచర్ కోసం గత అయిదేళ్లుగా తమ టీం కృషి చేస్తోందని గూగుల్ చెప్పింది. విమానాలు, పెద్ద పెద్ద వస్తువులను గుర్తించడానికి ఉపయోగించే రాడార్ టెక్నాలజీ లాంటి ఈ సరికొత్త మోషన్ సెన్స్ రాడార్ (సోలి) పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. గతంలో సోనీఎరిక్సన్ నుంచి ఈ తరహా ఫీచర్‌తో కొన్ని ఫోన్లు వచ్చాయి.
మొబైల్‌ను ముట్టుకోకుండానే చేతి సైగలతోనే ఆపరేట్ చేయగలగడమే మోషన్ సెన్స్. అలారంను ఆపటానికి, పాటలను స్కిప్ చేయడానికి, ఫోన్ కాల్స్‌ను సైలెంట్‌లో పెట్టడానికి ‘సోలి’ ఎంతగానో ఉపయోగపడనుంది. వినియోగదారుడు ఫోన్‌కు దగ్గరగా ఉన్నప్పుడు చేతి కదలికలను కూడా ఈ ఫీచర్ పసిగడుతుంది. దాని ద్వారా ఫోన్ ఆపరేట్ అవుతుంది. అంటే కాల్‌ను సైలెంట్‌లో పెట్టాలంటే స్క్రీన్‌ను టచ్ చేయకుండా పైన అలా చేత్తో సైగచేస్తే సరిపోతుంది.
ఫేస్ అన్‌లాక్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయాలంటే… కెమెరా ముందు ముఖాన్ని ఉంచి అది గుర్తు పట్టేంత వరకు చూస్తూ ఉండాలి. అయితే పిక్సెల్ 4 మొబైల్స్‌లో ఫోన్‌ను తలకిందులుగా పట్టుకున్నా అన్‌లాక్ అవుతుంది. రాత్రివేళల్లోనూ ఫేస్ అన్‌లాక్ పని చేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా వినియోగదారుడి ముఖం ఇమేజ్ ఫోన్‌లోనే ప్రాసెస్ అయ్యి సేవ్ అవుతుంది.